సీమ‌కు జ‌గ‌న్ ఏం చేయ‌లేదో చెప్పిన ప‌వ‌న్‌

సీమ‌కు జ‌గ‌న్ ఏం చేయ‌లేదో చెప్పిన ప‌వ‌న్‌

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర, నర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. శంషాబాద్ లో  కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తల సమావేశం జ‌నసేనాని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగించ‌డం గురించి కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు తెలియచేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేయడంతోనే అభివృద్ధి జరిగిపోదని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళికలు కావాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటిహబ్ లాంటివి నెలకొల్పితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

రాయలసీమ ప్రాంతం కొన్ని కుటుంబాలు, గ్రూపుల చేతిలో చిక్కుకుపోయిందని ప‌వ‌న్ ఆరోపించారు. ``ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలకులు మారతారు తప్ప ప్రజల తలరాతలు మారవు. ఇప్పటి వరకు సీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించలేకపోయారు. నాయకులు వేల కోట్లు సంపాదిస్తున్నారుగానీ ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు. వాళ్ల మోచేతి నీళ్లు తాగే మనం బతకాలని వారు కోరుకుంటున్నారు.`` అని మండిప‌డ్డారు.

దశాబ్దాలుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పకుంటున్న ఏ పార్టీ కూడా రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయిందని, యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ఆరోపించారు. ``జగన్ రెడ్డి రాయలసీమలో ఒక ఐటీ హబ్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతోనే బీజేపీతో జనసేన పార్టీ జతకట్టింది. మన జీవితం మారాలంటే పరిశ్రమలు రావాలి .. పరిశ్రమలు రావాలి అంటే పెట్టుబడుదారుల్లో విశ్వాసం రావాలి... పెట్టుబడుదారుల విశ్వాసం చూరగొనాలి అంటే రాజకీయ నాయకులు వాటాలు అడగటం మానేయాలి.`` అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. అలాంటి పాలనను జనసేన పార్టీ తీసుకొస్తుందని, అతి తర్వలో జనసేన కర్నూలు పార్లమెంట్ కార్యాలయాన్ని కర్నూలు పట్టణంలో పెడతామ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని మాట్లాడితే నా దిష్టిబొమ్మను దగ్ధం చేసేంత కోపం ఉన్న కర్నూలు నాయకులకి... సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు కోపం రాలేదని ప‌వ‌న్  ప్రశ్నించారు. కర్నూలుకు హైకోర్టు అడిగే ముందు సుగాలీ ప్రీతికి న్యాయం జరిగితే అప్పుడే నైతికంగా బలం చేకూరుతుందనే విషయాన్ని గుర్తించాలి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English