వారికి బలహీనతలు- బాబుకు బలాలు!

వారికి బలహీనతలు- బాబుకు బలాలు!

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ,టీఆర్ ఎస్ ల బలహీనతలనే బలాలుగా చేసుకుని ముందుకు సాగాలని భావిస్తున్నారు. అటు తొమ్మిదేళ్ల అధికార పార్టీ కాంగ్రెస్ కు ఉన్న బలహీనతలు ఏమిటో ఇప్పటికే అనేక సార్లు బయపటపడ్డాయి. ఇక మూడేళ్ల వయసున్న జగన్ పార్టీ విషయంలోనూ అనేక బలహీనతలు తేటతెల్లమయ్యాయి. టీఆర్ ఎస్ పని సరేసరి!

అంతర్గత కలహాలతో అసమర్థ ప్రభుత్వంగా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ పేరుతెచ్చుకుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చకపోగా..వారిని పన్నులతో బాదుతూ కిరణ్ కావలసినంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. వీటన్నింటి విషయంలో కిరణ్ ప్రభుత్వాన్ని చేతకాని దద్దమ్మల ప్రభుత్వమనే అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మహానాడు వేదికగా అయినా రేపు బస్సుయాత్ర విషయంలోనైనా బాబు అనుసరించబోయే వ్యూహం ఇదే. ఇక అధినేత జైలు పాలయ్యి చిక్కుల్లో పడ్డ జగన్ పార్టీ ని బాబు తన విమర్శలతో ఒక ఆట ఆడుకొంటున్నారు. ఇందకు ప్రతిగా జగన్ పార్టీ చేస్తున్న విమర్శల విషయంలో కూడా బాబు వ్యంగ్యపూర్వకంగా వదులుతున్న మాటలు బాగా పేలుతున్నాయి.

జగన్ కు బెయిలు రాకపోవడంలో కూడా చంద్రబాబు హస్తం ఉందని జగన్ పార్టీ ఆరోపించడం, సుప్రీం కోర్టు బెయిలు నిరాకరిస్తే తాను ఏ విధంగా బాధ్యుడను అవుతానని చంద్రబాబు రివర్స్ పంచ్ ఇవ్వడం బాగా కుదిరింది. తెలంగాణ ఉప ప్రాంతీయ పార్టీ టీఆర్ ఎస్ విషయంలో కూడా బాబు వెనక్కు తగ్గడం లేదు. టీఆర్ ఎస్ బలహీనత అయిన వసూళ్ల అంశాన్ని బాబు వాడుకుంటున్నారు. వారిది వసూళ్ల విధానాన్ని బాబు ప్రస్తావిస్తున్నారు. ఇలా ప్రత్యర్థుల బలహీనతల మీద బాబు స్వారీ చేస్తున్నారు. తాను అనుకున్న 2014 ఎన్నికల గమ్యం దిశగా ప్రయాణిస్తున్నారు.