వైఎస్ మీద వైకాపా తీవ్ర విమర్శలు

వైఎస్ మీద వైకాపా తీవ్ర విమర్శలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తీవ్రమైన సంకట స్థితి వచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బ్రేక్ పడ్డ నేపథ్యంలో ఏకంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది జగన్ సర్కారు. ఈ దిశగా ఆల్రెడీ కేబినెట్ తీర్మానం కూడా జరిగింది. కానీ ఎన్టీఆర్ ఎప్పుడో రద్దు చేసిన మండలిని తిరిగి తీసుకొచ్చిన పుణ్యం/పాపం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికే చెందుతుంది.

ఉమ్మడి రాష్ట్రంలో మండలి పున:ప్రారంభమైన సందర్భంగా ఆయన దాని గురించి గొప్పగా మాట్లాడారు. "రాష్ట్ర చరిత్రలో మండలి ఏర్పాటు ఒక చారిత్రక దినం. ప్రస్తుతం శాసన సభలో చర్చలు సరిగా జరగట్లేదు. మండలిలో తగు చర్చ జరిగితే అసెంబ్లీకి ఊతం ఇచ్చినట్లు అవుతుంది" అంటూ 2007 ఏప్రిల్ 2న వైఎస్ తన ప్రసంగంలో సెలవిచ్చారు.

కానీ వైఎస్‌ ఆశయాలే లక్ష్యంగా అడుగులేస్తున్నట్లు చెప్పే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రికి పూర్తి భిన్నమైన స్వరం వినిపిస్తున్నారు. మండలి శుద్ధ దండగ అని.. అది తనకు నచ్చలేదని.. ప్రజాధనం వృథా అయిపోతోందని అసెంబ్లీ ప్రసంగంలో అన్నారు. జగన్ అయినా మండలి పట్ల వ్యతిరేకతను ఒకట్రెండు మాటల్లో తేల్చేశాడు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పేజీలో ఆ పార్టీ ముఖ్య నేతల వ్యాఖ్యలు చూస్తే పరోక్షంగా వైఎస్‌ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నట్లే ఉంది.

"ఎన్నికల్లో గెలవలేని వారికి మండలి రాజకీయ పునరావాసంగా మారింది. పార్లమెంట్ ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదు. బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెద్దల సభను ఏర్పాటు చేశారు" అంటూ వైకాపా ఎమ్మెల్యే ధర్మాన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ వైకాపా ట్విట్టర్ పేజీలో పోస్టు పెట్టారు. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. దీని ప్రకారం మండలిని మళ్లీ తీసుకొచ్చిన వైఎస్‌ది బ్రిటిషర్ల మనస్తత్వం అని చెప్పినట్లు అవుతోంది. మండలి విషయంలో చేస్తున్న ప్రతి విమర్శా వైఎస్‌కు తాకుతుండటం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English