మోడీకి సొంత ఎంపీ వార్నింగ్

మోడీకి సొంత ఎంపీ వార్నింగ్

ఏంది మోడీకి వార్నింగ్ ఇచ్చేటోడు బీజేపీలో ఉన్నాడా? ప్రత్యర్థి పార్టీలో ఆయనతో పెట్టుకోవటానికి కిందా మీదా పడిపోతున్న వేళ.. సొంత పార్టీ నేత అంత సాహసం చేస్తాడా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. సుబ్రమణ్య స్వామి అన్న డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న నేత పార్టీలోనే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. విషయం ఏదైనా కానీ.. ఎదుట వ్యక్తి మరెవరైనా పెద్దగా పట్టించుకోకుండా.. తాను నమ్మిన విధానాలకు భిన్నంగా ముందుకెళుతుంటే చాలు.. చీపురుతో చిమ్మినట్లుగా విమర్శలతో ఉతికి ఆరేసే వైనం ఆయనకు ఎక్కువే.

తాజాగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వందశాతం వాటాల్ని అమ్మాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయం తీసుకోవటంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం పూర్తిగా జాతి వ్యతిరేకమైనదిగా ఆయన అభివర్ణించారు.

అంతేనా.. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో కుండబద్ధలు కొట్టిన ఆయన.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. అంతేకాదు.. తన మాటను పెద్దగా లక్ష్య పెట్టకుండా మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తే తాను న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తానని చెప్పారు.

న్యాయస్థానం ద్వారా కేంద్ర నిర్ణయాన్ని అడ్డుకోగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. కుటుంబ సంపద లాంటి ఎయిరిండియాను విక్రయించటం సరికాదన్న సుబ్రమణ్యస్వామి.. వాటాల్ని అమ్మేసే బదులు.. ఎయిరిండియాను లాభాల బాట పట్టేలా చేయాలన్నారు. సొంత పార్టీకి చెందిన సుబ్రమణ్య స్వామినే ఎయిరిండియా అమ్మకాన్ని ఇంతలా వ్యతిరేకిస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ లాంటోళ్లు ఊరికే ఉంటారా? మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

జీడీపీ ఐదు శాతానికి దిగువునకు పడిపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్రం దగ్గర డబ్బుల్లేవన్నారు. ప్రభుత్వాలు డబ్బుల్లేక దివాలా తీస్తే ఇలానే చేస్తాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకానికి కోట్లాది రూపాయిలు చెల్లించాల్సి ఉందన్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ సర్కారుకు.. విలువైన ఆస్తులు అమ్ముకోవటం మినహా మరింకేం ఉందని మండిపడ్డారు. సొంత పార్టీ నేతతో పాటు.. విపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్న వేళ.. ఎయిరిండియా అమ్మకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English