ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!


ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచారు.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీ కండువాను కూడా క‌ప్పుకొన్నారు. ఇంత వ‌రకు బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న క‌ల‌వ‌లేక పోతున్నారు. అడుగడుగునా.. ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అస‌లు ఆయ‌న వైసీపీలోనే ఉంటారా?  లేక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. మ‌ళ్లీ పాత‌గూటికి చేరుకుంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు కాబ‌ట్టి.. ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు.

ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌రంటే.. విశాఖ‌న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్‌. ఈయ‌న టీడీపీకి అత్యంత కావ‌ల‌సిన మ‌నిషి. పైగా.. చంద్ర‌బాబుకు స‌న్నిహితుడ‌నే పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అనూ హ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాది త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయారు. కుమారుడిని వెంట‌బెట్టుకుని మ‌రీ వెళ్లి జ‌గ‌న్‌తో కండువాలు క‌ప్పించుకున్నారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. స్థానిక వైసీపీ నేత‌ల‌తో మాత్రం వివాదాలు పెట్టుకుంటున్నారు.

వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న `చెద‌పురుగులు` అంటూ బ‌హిరంగంగా ఇటీవ‌ల చేసిన కామెంట్‌.. తీవ్ర‌స్థాయిలో దుమారం రేపుతోంది. దీనిపై ఆగ్ర‌హించిన‌.. వైసీపీస్థానిక నేత‌లు.. అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు ఆయ‌న పార్టీలో ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. టీడీపీలోకి వెళ్లిపోయే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని.. అందుకే త‌మ‌ను తిట్టిపోస్తున్నార‌ని.. వారి వాద‌న‌. ఇప్ప‌టికే దీనిపై కీల‌క స‌ల‌హాదారుడికి ఫిర్యాదు చేశారు. మ‌రో వైపు.. వాసుప‌ల్లి కూడా వైసీపీనేత‌లు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఇటీవ‌ల‌.. సీఎం జ‌గ‌న్ చేదోడు ప‌థ‌కం కింద నిధులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి నాయ‌కులు ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి.. స్థానిక ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు కూడా ఆహ్వానం పంపారు. అయితే.. ఆయ‌న మాత్రం హాజ‌రు కాలేదు. ఈ విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. దీంతో ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా?  అంటూ.. వైసీపీ నాయ‌కులు.. వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, ఈ విష‌యంలో గ‌ణేష్ రివ‌ర్స్‌గా ఆలోచిస్తున్నారు.

వైసీపీ నాయ‌కులు త‌న‌తో కావాల‌నే గొడ‌వ పెట్టుకుంటున్నార‌ని.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న‌కు ఫాలోయింగ్ ఉంద‌ని.. అది చూసి ఓర్వ‌లేకే.. ఇప్పుడు త‌న‌కు పొగ‌పెడుతున్నార‌ని.. ఆయ‌న చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధాలు జ‌రుగుతున్నాయి. మ‌రి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.