లాంగ్ మార్చ్ రద్దు... కారణాలేంటంటే?

లాంగ్ మార్చ్ రద్దు... కారణాలేంటంటే?

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ... రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా జనసేన, బీజేపీలు నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ ఉన్నపళంగా రద్దు అయిపోయింది. ఫిబ్రవరి 2న సీతానగరం నుంచి విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ దాకా లాంగ్ మార్చ్ ను నిర్వహించాలని, ఆ తర్వాత అదే గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా మిత్రపక్షాలుగా మారిన ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. లాంగ్ మార్చ్ ప్రకటన వెలువడిన నాలుగు రోజులకే... దానిని రద్దు చేస్తున్నట్లు బీజేపీ నుంచి ప్రకటన రాగా... జనసేన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మిత్రపక్షాలుగా మారిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లో దేని నుంచి ప్రకటన వచ్చినా... రెండు పార్టీలు సమ్మతించినట్టుగానే భావించాలి కదా.

సరే... లాంగ్ మార్చ్ రద్దు అయిపోయింది. దీనికి గల కారణాలు అయితే జనానికి చెప్పాలి కదా. అయితే లాంగ్ మార్చ్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసిన బీజేపీ... అందుకు గల కారణాలను మాత్రం ఆ ప్రకటనలో పేర్కొనకపోవడం గమనార్హం. ఈ నేఫథ్యంలో ఏ కారణం చేత లాంగ్ మార్చ్ రద్దు అయ్యిందన్న విషయంపై ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు చెప్పేస్తున్నారు. కొంతమంది అయితే చాలా ముందుకు వెళ్లి...ఇరు పార్టీల మధ్య నాలుగు రోజులకే పొరపొచ్చాలు వచ్చాయని, ఈ కారణంగానే లాంగ్ మార్చ్ రద్దైందన్న వాదనను వినిపిస్తున్నారు. ఈ కారణం అయితే నమ్మశక్యంగా లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో అసలు లాంగ్ మార్చ్ వాయిదాకు కారణాలేంటన్న విషయాన్ని పరిశీలిస్తే... ప్రస్తుతం రాజధాని రైతుల నిరసనల నేపథ్యంలో ఫిబ్రవరి 5 దాకా అటు రాజధాని పరిదిలో పాటు ఇటు విజయవాడలోనూ 144 సెక్షన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. 144 సెక్షన్ కారణంగా లాంగ్ మార్చ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాకుండా లాంగ్ మార్చ్ తర్వాత పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించాలని రెండు పార్టీలు భావించినా... ఆ రోజు గ్రౌండ్ ను వేరే ఎవరో ఏదో కార్యక్రమం కోసం బుక్ చేసుకున్నారట. ఇక ఇంకో కారణం ఏంటంటే... రెండు పార్టీలు మిత్రపక్షాలుగా మారిన తర్వాత నిర్వహిస్తున్న భారీ కార్యక్రమంతో బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేతలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్లాన్ రచిస్తే... ఆ నేతల షెడ్యూల్ సహకరించలేదట. మొత్తంగా ఈ మూడు కారణాల్లో ఏదో ఒక దాని కారణంగానే లాంగ్ మార్చ్ రద్దు అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English