ఓట్లతో కాదు... స్కేలుతోనే గెలిచేశాడే

ఓట్లతో కాదు... స్కేలుతోనే గెలిచేశాడే

నిజమేనండోయ్... ఎన్నికల్లో సిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. జనం ఓట్లతో కాకుండా చిన్న పిల్లలు గీతలు గీసుకునేందుకు వినియోగించే ఓ స్కేలుతో ఈ అభ్యర్థి గెలిచాడు. ఇదేదో... మనకు దూరంగా ఉన్న ఏ దేశంలోనో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే... ఈ సిత్రం తెలంగాణలో శనివారం ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఈ సిత్రంతో గెలిచిన అభ్యర్థి అధికార టీఆర్ఎస్ అభ్యర్థి అయితే... స్కేలు కారణంగా ఓడిన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి. అంటే 15 సెంటీ మీటర్ల పొడవు ఉండే స్కేలుతో టీఆర్ఎస్ విజయం సాధిస్తే... బీజేపీ అభ్యర్థి ఓడిపోయారన్న మాట.

అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. మేడ్చల్ జిల్లా కొంపల్లి పురపాలక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. అయితే ఫలితాల విషయంలో అన్ని వార్డుల ఫలితాలను ఓటర్లు నిర్దేశిస్తే… 3వ వార్డు గెలుపును మాత్రం ఓ స్కేల్ నిర్ణయించింది. ఇక్కడ పొటీ చేసిన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులకిద్దరికీ సమానంగా ఓట్లొచ్చాయి. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సన్న శ్రీశైలం యాదవ్‌కు.. బీజేపీ నుంచి పోటీలోకి దిగిన మోహన్ రెడ్డికి చెరిసమానంగా 356 ఓట్లు వచ్చాయి.

అయితే ఒక ఓటు మాత్రం.. ఇరు పార్టీల గుర్తులకు మద్య ఉండటంతో అధికారులు దీనిపై అయోమయానికి గురయ్యారు. అంటే... రెండు పార్టీల గుర్తులకు మధ్యలో స్వస్తిక్ పడిపోయిన ఓటు ఎవరికి వస్తే.. వారు విజయం సాధించినట్టన్న మాట. దీనిపై తర్జనభర్జన పడ్డ కౌంటింగ్ అధికారులు... ఉన్నతాధికారులను సంప్రదించడంతో.. ఆ బ్యాలెట్ పేపరును స్కెల్‌తో కొలిచి.. ఎక్కువ భాగం ఏ గుర్తు మీద ఉంటే వారికి వచ్చినట్లు ప్రకటించాలని సూచించారట.

దీంతో స్కేలును పట్టి కొలత కొలిచిన అధికారులు... స్వస్తిక్ గుర్తులోని మెజారిటీ భాగం టీఆర్ఎస్ వైపే ఉండటంతో.. అది టీఆర్ఎస్ ఓటుగా గుర్తించి.. టీఆర్ఎస్ అభ్యర్ది సన్న శ్రీశైలం యాదవ్ గెలిచినట్లు ప్రకటించారు. స్వస్తిక్ గుర్తులోని తక్కువ భాగం తన గుర్తుపై ఉన్నా బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. వెరసి ఈ ఎన్నికను ఓటర్లు కాకుండా ఓ స్కేలు నిర్ణయించిందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English