జగన్ తీస్తారట.. బాబు తీసుకొస్తారట

జగన్ తీస్తారట.. బాబు తీసుకొస్తారట

ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పలువురు విస్మయానికి గురవుతున్నారు. అసలు ఆ రాష్ట్రంలో ఏమవుతోంది? అన్నది ప్రశ్నగా మారింది. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టటమే కాదు.. తెలుగుదేశం పార్టీకి భారీ షాకిచ్చారు ఏపీ ఓటర్లు. ఇలాంటివేళ.. అధికారంలోకి వచ్చిన జగన్ తనదైన పాలనను సాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మార్పులు.. చేర్పులు మామూలే. అయితే.. ప్రతి విషయానికి రార్దాంతం చేయటం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారింది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పు పట్టటం.. ఏదో జరిగిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేయటం రివాజుగా మారింది.

మూడు రాజధానుల మీద తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే తీసుకుంటే.. తాను చెప్పినట్లు.. తాను కోరుకున్నట్లే జగన్ ప్రభుత్వం పని చేయాలనుకోవటంలో అర్థం ఏముంది? ఈ రోజున మూడు రాజధానుల గురించి ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది.

ఏపీ రాజధాని గురించి గతంలో తనకు బాబు చెప్పిన దానికి.. అమరావతి నిర్ణయానికి సంబంధం లేదని అప్పట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావించటాన్ని మర్చిపోకూడదు. ప్రజల నుంచి ఒక్క ఎకరం కూడా తీసుకోకుండానే రాజధాని నగరాన్ని నిర్మిస్తానని బాబు తనతో స్వయంగా చెప్పారని.. ఆ తర్వాత తనకెలాంటి సమాచారం ఇవ్వకుండానే రైతుల వద్ద నుంచి భూములు తీసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లుగా పవన్ ఆరోపించటాన్ని మర్చిపోలేం. ఇలా చూసినప్పుడు.. ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన భాగస్వామ్య పక్షానికే సమాచారం ఇవ్వకుండా తనకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు.. ఈ రోజు అధికారపక్షం తీసుకునే నిర్ణయాల్ని ఎలా ప్రశ్నిస్తారన్నది ప్రశ్న.

రాజధానిని విశాఖకు తరలించాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయంగా జగన్ చెప్పేస్తే.. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకొస్తామని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మండలి అవసరం ఏముందంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించటమే కాదు.. మండలిని రద్దు చేయాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఒకవేళ మండలిని తీసేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిని పునరుద్ధరిస్తామని బాబు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదంతా చూస్తున్నప్పుడు జగన్ పాలన గజిబిజిగా ఉందన్న భావన కలుగ జేసేందుకు వీలుగా బాబు వేస్తున్న ఎత్తులు ఇట్టే అర్థమైపోతాయి. రాజకీయాల్ని పక్కన పెడితే.. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాత్రం అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజలు ఓటుతో అవకాశం ఇచ్చిన తర్వాత కూడా.. తనకు తోచినట్లుగా పాలన చేసుకునే అవకాశం బాబు ఇవ్వకపోవటం సరి కాదంటున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English