అనుకున్నట్లే.. పుర ఎన్నికల్లో టాప్ గేరులో కారు జోరు

అనుకున్నట్లే.. పుర ఎన్నికల్లో టాప్ గేరులో కారు జోరు

అంచనాలు నిజమయ్యాయి. గులాబీ కారు జోరుకు ఎదురే లేకుండా పోతోంది. ఒక్కో ఎన్నిక గడుస్తున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీ అంతకంతకూ బలపడిపోతుంటే.. అందుకు భిన్నంగా ప్రత్యర్థులు కుంచించుకుపోతున్న దుస్థితి. తాజాగా ఈ నెల 22న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పుర ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న మాట బలంగా వినిపించింది.

అందుకు తగ్గట్లే తాజా ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాగిన ఎన్నికల్లో ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలు చూస్తే.. కార్పొరేషన్లు అన్ని టీఆర్ఎస్ విజయం సాధిస్తే.. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటివరకూ ఒక్క కార్పొరేషన్లో కూడా అధిక్యతలో లేదు. ఇక.. మున్సిపాలిటీలకు వస్తే ఇప్పటివరకూ ఫలితాలు వెలువడిన వాటిల్లో 90 శాతం మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరితే.. తర్వాతి స్థానం కాంగ్రెస్.. బీజేపీలు ఉన్నాయి.

ఫలితాల ట్రెండ్ చూస్తే.. ఎనిమిది కార్పొరేషన్లకు ఎనిమిది టీఆర్ఎస్ వశం కావటం ఖాయమని చెప్పక తప్పదు. అదే సమయంలో 120 మున్సిపాలిటీలకు టీఆర్ఎస్ 105 నుంచి 110 వరకు సొంతం చేసుకునే వీలుంది. మిగిలిన పార్టీలకు పది మున్సిపాలిటీల్లో మాత్రమే పాగా వేసే వీలుంది.

ఒకవేళ మున్సిపాలిటీల్లో గెలిచినా ఎక్స్ అఫీషియో ఓట్లు.. ఇండిపెండెంట్లతో కలిపి ఆయా మున్సిపాలిటీలను సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది.మొత్తంగా పుర ఎన్నికల ఫలితాలు వస్తున్న తీరు చూస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదన్న విషయం మరోసారి స్పష్టమైనట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English