13 నగరాల్ని మూసేశారు.. 4 కోట్ల మందిపై అష్టదిగ్బంధనం

13 నగరాల్ని మూసేశారు.. 4 కోట్ల మందిపై అష్టదిగ్బంధనం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూ చైనాను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. రోజు గడిచేసరికి ఈ వైరస్ విస్తరిస్తున్న వైనంతో డ్రాగన్ దేశానికి దడ పుట్టిస్తోంది. దీంతో.. మరిన్ని కఠినమైన చర్యల్ని చేపట్టింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో చైనాలోని 13 నగరాల్లో రాకపోకల్ని.. రవాణాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ నగరాల పరిధిలోని నాలుగు కోట్ల మంది ప్రజలు ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి.

వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ భారీ నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా శుక్రవారం ఒక్కరోజులో ప్రాణాలు పోయిన వారి సంఖ్య 26కు చేరుకోగా.. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 880కు చేరింది. పలు ప్రావిన్స్ లో ఈ వైరస్ ను గుర్తిస్తున్నారు.

కరోనా వైరస్ ఉన్న ప్రాంతాల్లో రవాణా మీద ఆంక్షలు విధించారు. వారు తాము ఉన్న ప్రాంతం నుంచి బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కరోనాకు మూల స్థానమైన ప్రాంతాల్లో ఒకటిగా భావించే వుహాన్ లో వ్యాధి తీవ్రత కారణంగా ట్రావెల్స్ ఏజెన్సీలను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఒక్క ప్రావిన్స్ లోనే సుమారు రూ.వెయ్యి కోట్లకు పైనే నిధుల్ని కేటాయించటం చూస్తే.. పరిస్థితిలో తీవ్రత ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కళాశాలల్ని మూసివేయటం.. వైద్యాధికారుల్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించటమే కాదు.. సైన్యంలోని వైద్యాధికారుల్ని వైరస్ బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. షాంఘైలో ప్రజా ఆరోగ్య భద్రత హెచ్చరికను ఒకటో నంబరు స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రవాణా వ్యవస్థను పూర్తిగా నియంత్రించటంతో ఆయా ప్రాంతాల్లోని నాలుగు కోట్ల మంది ప్రజలు అష్టదిగ్బంధనానికి గురైన పరిస్థితి నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English