సాక్షిలో బాలయ్య ఫొటో.. పిచ్చ కామెడీ

సాక్షిలో బాలయ్య ఫొటో.. పిచ్చ కామెడీ

సాక్షి పత్రికకు ముసుగులేమీ లేవు. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల పత్రిక. కొన్నిసార్లు ఆ పత్రిక తీరు చూస్తే వైకాపాకు కరపత్రంలా అనిపించడం వాస్తవం. ఈ విషయాన్ని ఆ పార్టీ వాళ్లు కూడా అంగీకరిస్తారు. ఐతే వైకాపాకు అనుకూలంగా వ్యవహరించవచ్చు. ప్రత్యర్థి పార్టీల వాళ్లను టార్గెట్ చేయవచ్చు. కానీ ఈ విషయంలో మరీ హద్దులు దాటిపోవడం, జనాల్ని తప్పుదోవ వార్తలు ఇవ్వడమే అభ్యంతరకరం. వైకాపాకు ఇబ్బంది కలిగించే అంశాల్ని ఆ పత్రిక కవర్ చేసే తీరు కొన్నిసార్లు విస్మయానికి గురి చేస్తుంటుంది. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది.

మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో రోజా సహా కొందరు వైకాపా ఎమ్మెల్యేలు సెల్ఫీ దిగిన సంగతి తెలిసిందే. అవతల వరుసలో చంద్రబాబు సీరియస్‌గా కనిపిస్తుంటే.. ఇటువైపు బాలయ్యతో కలిసి రోజా సెల్ఫీ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

ఈ ఫొటో రెండు పార్టీలకు ఇబ్బంది కలిగించేదే. ఓవైపు మూడు రాజధానుల తీర్మానంపై రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. క్షేత్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇలా వైరి పార్టీల ఎమ్మెల్యేల మధ్య ఈ సెల్ఫీ ఏంటనే ప్రశ్న తలెత్తింది. వీళ్లు వీళ్లు ఒకటే.. మధ్యలో జనాలే వెర్రివాళ్లు అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే ఈ సెల్ఫీ తమ పార్టీకి డ్యామేజ్ చేస్తుందనిపిస్తే దాన్ని ప్రచురించకుండా వదిలేయొచ్చు. కానీ సాక్షి అలా చేయలేదు. అసలు సెల్ఫీ తీసిందే రోజా అయితే.. ఆమెనే ఫొటో నుంచి కట్ చేశారు. చంద్రబాబు, బాలయ్య కవర్ అయ్యేలా ఫొటో పెట్టి ‘శాసన మండలిలోని అధికారుల గ్యాలరీలో కూర్చొని కుతంత్రాలు నడుపుతున్న చంద్రబాబు, పక్కన బాలకృష్ణ తదితరులు అంటూ వ్యాఖ్య జోడించడం గమనార్హం. ఇది జనాల్ని ఎంతగా తప్పుదోవ పట్టించేదో వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ సోషల్ మీడియాలో అసలు ఫొటో ఇప్పటికే వైరల్ అయిన నేపథ్యంలో అక్కడి జనాలకిది కామెడీగా అనిపిస్తోంది. సాక్షి పత్రికను ఓ రేంజిలో ఆడేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English