ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ కు కాంగ్రెస్ చిక్కులు, బీజేపీ సంబరం

ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ కు కాంగ్రెస్ చిక్కులు, బీజేపీ సంబరం

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీ సాధించింది. ఈ భారీ విజయం అనంతరం జరుగుతున్న ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికపై మీడియా, ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇటీవల మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ విజయం సాధించినప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపు ఉంది. గత ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 67 సీట్లు గెలిచింది. బీజేపీ 3 మాత్రమే గెలిచింది. దీంతో ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ఎంతో కీలకం.

ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2013, 2015 ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు దాదాపు స్థిరంగా ఉంది. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మరలింది. దీంతో కేజ్రీవాల్ పార్టీకి ఏకంగా 67 సీట్లు వచ్చాయి. బీజేపీ ఓటు బ్యాంకు ఎప్పుడూ స్థిరం. కాబట్టీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు దాదాపు ఒకే ఓటు బ్యాంకు కోసం ఫైట్ చేసుకుంటున్నట్లే.

2013లో 70 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 29.49 శాతం ఓటు బ్యాంకుతో 28 సీట్లు, కాంగ్రెస్ 24.55 శాతం ఓటు బ్యాంకుతో 8 సీట్లు, బీజేపీ 33.07 శాతం ఓటు బ్యాంకుతో 31 సీట్లు గెలిచింది.

2015లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మూడింట రెండొంతులు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లింది. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 54.3 శాతం ఓటు బ్యాంకుతో 67 సీట్లు, కాంగ్రెస్ 9.8 ఓటు బ్యాంకుతో సీట్లేమీ గెలవలేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏకంగా 25 నుంచి 10 శాతానికి పడిపోయింది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు 30 శాతం నుంచి 54 శాతానికి పెరిగింది.

ఇక బీజేపీ ఓటు బ్యాంకు దాదాపు స్థిరంగా ఉంది. 2013లో 33.07 శాతం ఓటు బ్యాంకు సాధించిన ఈ పార్టీ 2015లో 32.1 ఓట్లు రాబట్టుకోగలిగింది. కానీ కాంగ్రెస్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లడంతో ఓటు బ్యాంకు నిలుపుకున్నా సీట్లు మాత్రం మూడు మాత్రమే దక్కించుకుంది.

అయితే ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీగా మారిందని విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఢిల్లీలో సత్తా చాటాలనుకుంటోంది. తన ఓటు బ్యాంకును, సీట్లను ఈసారి భారీగా మెరుగుపరుచుకుంటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా సిటిజన్ షిప్‌ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)పై తమ పోరు కారణంగా మైనార్టీ ఓట్లు ఈసారి తమకే ఉంటాయని ధీమాగా ఉంది. నాలుగైదు సీట్లలో ప్రభావం చూపగల ఆర్జేడీతోను కలిసి పోటీ చేస్తోంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సిద్ధూ, ఖుష్బూ, నగ్మా తదితరులు ప్రచారం చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకును మెరుగుపరుచుకుంటే అది తమకే లాభమని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు మరలుతుందని, తమ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా ఉందని బీజేపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, సీఏఏ, ఎన్ఆర్‍‌సీలపై విపక్షాల పోరును ప్రజలు చీదరించుకుంటున్నారని, ఢిల్లీ ప్రజలు వారిని తిప్పికొడతారని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English