బాలయ్యా.. ఇది కరెక్టేనా?

బాలయ్యా.. ఇది కరెక్టేనా?

ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం పాలైనప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ రాజకీయంగా అంత యాక్టివ్‌గా లేడు. అసెంబ్లీ సమావేశాల్లో కనిపించని ఆయన.. వేరే రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. రాజధానిని అమరావతి నుంచి తరలించడంపై గత రెండు నెలలుగా పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నా బాలయ్య మాత్రం మిన్నకుండిపోయాడు. అమరావతికి వెళ్లి రైతుల కోసం పోరాడతాడనుకుంటే.. అడ్రస్ లేకుండా పోయాడు. బాలయ్య లాంటి సెలెబ్రెటీ ఎమ్మెల్యే గ్రౌండ్ లెవెల్లోకి దిగి పోరాటం చేస్తే కచ్చితంగా అమరావతి రైతులకు నైతిక బలం వచ్చేది. అధికార పక్షం మీదా ఒత్తిడి పడేది. కానీ బాలయ్య అదేమీ చేయలేదు. చివరికిప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు బాలయ్య. మూడు రాజధానుల తీర్మానంపై ఓటింగ్ ఉంటుంది కాబట్టే బాలయ్య తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీకి వచ్చాడన్నది స్పష్టం.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో బాలయ్య ఎక్కడా పాల్గొన్నది లేదు. ఆయన తీరుపై తెలుగుదేశం అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా వాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అమరావతి కోసం తన వంతుగా ఏమీ చేయని బాలయ్య.. తనకు తెలియకుండానే తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం తీవ్రతను తగ్గించే పని చేశాడిప్పుడు. ఓవైపు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వాళ్ల కడుపు మండిపోతోంది. మరోవైపు అసెంబ్లీలో, శాసనమండలిలో పార్టీ వీలైనంత గట్టిగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో బాలయ్య నవ్వుతూ వైకాపా ఎమ్మెల్యేలతో సెల్ఫీ దిగడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. సెల్ఫీ అడిగింది రోజా అండ్ కోనే కావచ్చు. వాళ్లు అలా అడిగితే బాలయ్యకు క్రేజీగా అనిపించి ఉండొచ్చు.

కానీ  అధికార-ప్రతిపక్షం మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నపుడు, గ్రౌండ్ లెవెల్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన సమయంలో బాలయ్య ఇలా సరదాగా సెల్ఫీ దిగడం విమర్శల పాలవుతోంది. దీని వల్ల తెలుగుదేశం పోరాటంలో తీవ్రత తగ్గిపోయింది. కొందరేమో ఈ సెల్ఫీ చూసి బాలయ్య క్రేజుకిది నిదర్శనం అంటూ ఎలివేషన్లు ఇస్తున్నప్పటికీ.. పార్టీ ప్రయోజనాల్ని, సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ముమ్మాటికీ తప్పని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English