ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా... టీడీపీకి దెబ్బేనా?

ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా... టీడీపీకి దెబ్బేనా?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజధానిగా కొనసాగుతున్న అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు పరిమితం చేసేసి... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను, జ్యుడిషియల్ కేపిటల్ గా కర్నూలును మార్చేందుకు వైసీపీ సర్కారు తీర్మానించిన నేపథ్యంలో శాసనమండలిలో సదరు బిల్లుకు ఆమోదంపై ఆసక్తి రేకెత్తుతోంది.

 ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించినా... మండలిలో ఆమోదం లభిస్తుందా? లేదా? అన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ ఉన్నా... మండలిలో మాత్రం బలం టీడీపీదే. దీంతో మండలిలో బిల్లుకు ఆమోదం లబించే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా మంగళవారం నాటి సమావేశాలకు ఆయన హాజరు కాలేదు.

ఈ సందర్బంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చోటుచేసుకున్న ఓ దృశ్యం వైరల్ గా మారింది. మండలి సమావేశాలకు హాజరైన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మండలి సభ్యులను పలకరిస్తూ సాగుతున్న నేపథ్యంలో డొక్కా తన సీటును వీడి జగన్ వద్దకు వచ్చి మరీ కరచాలనం చేశారు. గతంలో చోటుచేసుకున్న ఈ దృశ్యం... ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లు మండలికి వచ్చిన సందర్భంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ ఆదేశాల మేరకే కీలకమైన సమయంలో డొక్కా తన పదవికి రాజీనామా చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలిలో బలంగా ఉన్న టీడీపీని బలహీనం చేసే దిశగానే జగన్ రచించిన వ్యూహంలో భాగంగానే డొక్కా తన పదవికి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో టీడీపీకి ఏకంగా 26 మంది సభ్యులున్నారు. మిగిరిన వారంతా నామినేటెడ్, స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన సభ్యులే. అంటే... టీడీపీ సభ్యులు కాకుండా మిగిలిన వారంతా కూడా వైసీపీకి సహకరించినా... వికేంద్రీకరణ బిల్లును నెగ్గించుకోలేదు. ఈ కారణంగానే టీడీపీ బలాన్ని వీలయినంతమేరకు కుదిస్తేనే తమ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న భావనతోనే వైసీపీ... టీడీపీ ఎమ్మెల్సీలకు వల విసురుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వికేంద్రీకరణ బిల్లు మండలికి వచ్చిన కీలక సమయంలో డొక్కా తన పదవికి రాజీనామా చేయడం టీడీపీకి షాకింగేనని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English