రాపాక ద్రోహం.. పవన్ ఏమన్నాడంటే?

 రాపాక ద్రోహం.. పవన్ ఏమన్నాడంటే?

జనసేన పార్టీ తరఫున గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక నేత రాపాక వరప్రసాద్. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కొన్ని నెలల పాటు పార్టీకి నిబద్ధుడిగానే ఉన్నాడాయన. కానీ అధికార పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడో.. లేక వైకాపా ఒత్తిడికి తలొగ్గాడో కానీ.. తాను గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టాడు. గత కొన్ని నెలల్లో జనసేనకు దూరంగా ఉంటూ.. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ రాపాక జై కొడుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై తన స్టాండ్ ఏంటో అసెంబ్లీ సాక్షిగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. రాపాక ఉద్దేశమేంటో అర్థమై.. ముందే ఈ ప్రతిపాదనపై పార్టీ స్టాండ్ ఏంటో వివరిస్తూ, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో వాయిస్ వినిపించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటనే విడుదల చేశారు.

కానీ పార్టీ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ రాపాక నిన్న అసెంబ్లీలో జగన్ సర్కారుకు జై కొట్టేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు తన ఆమోదాన్ని తెలిపారు. కేవలం తన మద్దతు ప్రకటించినా సరే.. కానీ జనసేన ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. ఈ పరిణామం జనసేన అధినేతకు ఎలా అనిపించి ఉంటుందో చెప్పేదేముంది? ఐతే రాపాక ఏం చేస్తున్నా సంయమనం పాటిస్తున్న పవన్.. అసెంబ్లీలో ఆయన తీరు విషయంలోనూ ఓపిగ్గానే స్పందించారు.

దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ స్టాండ్ ఏంటో ముందే స్పష్టంగా చెప్పినా రాపాక అదేమీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని పవన్ అన్నారు. దీనిపై పార్టీ సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించి బలమైన నిర్ణయం తీసుకుంటామని పవన్ అన్నారు. బహుశా రాపాకను జనసేన నుంచి సస్పెండ్ చేసే లాంఛనానికి ముహూర్తం దగ్గర పడినట్లే కనిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English