నేడే తెర‌పైకి షా వార‌సుడు...ఎందుకు ప‌ద‌వి ఇస్తున్నారంటే...

నేడే తెర‌పైకి షా వార‌సుడు...ఎందుకు ప‌ద‌వి ఇస్తున్నారంటే...

బీజేపీ జాతీయ అధ్యక్షుడి విష‌యంలో అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. భార‌త హోంమంత్రి, బీజేపీ ర‌థ‌సారథి అమిత్‌షా వార‌సుడు ఎవ‌రో తేలింది. పార్టీ సీనియర్‌ నేత, ప్ర‌స్తుత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జగత్‌ప్రకాశ్‌ నడ్డా బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఆయ‌న ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేడు జరుగనున్న ఓ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గత ఐదున్నరేళ్లుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ న‌మ్మినబంటు అమిత్‌ షా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి.. బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన మోదీ 2.0 ప్రభుత్వంలో ఆయనకు హోంశాఖ దక్కింది. ‘ఒక వ్యక్తి, ఒక పదవి’ సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించడంతో అమిత్‌ షా ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయాధ్యక్షుడి పదవికి కొత్త వ్యక్తిని తీసుకోవడం అనివార్యమైంది. దీంతో పార్టీకి ఎంతోకాలంగా విధేయుడిగా ఉన్న నడ్డాను ఆ పదవికి ఎంపిక చేయనున్నారు.

ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్న న‌డ్డా  విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నడ్డాకు మచ్చలేని నేతగా ఆ పార్టీలో మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోదీ, హోంమంత్రి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా భావించడంతో ఆయన ఎన్నిక ఖరారు అయిపోయింది. బీజేపీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక కోసం నామినేషన్‌ ప్రక్రియను సోమవారం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రాధా మోహన్‌ సింగ్‌ ఆదివారం తెలిపారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం పోటీ నెలకొనే పరిస్థితి ఎదురైతే, ఆ మరుసటి రోజు(మంగళవారం) ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English