ఏపీ మంత్రి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం

ఏపీకి చెందిన ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. సోమ‌వారం ఉద‌యం గుండెపోటుకు గురైన ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి.. చికిత్స అందించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న ప‌ల్స్ పూర్తిగా పడిపోవ‌డం.. హృద‌య స్పంద‌న‌లు కూడా త‌గ్గిపోవడంతో తుదిశ్వాస విడిచిన‌ట్టు వైద్యులు తెలిపారు. గౌతం రెడ్డి వ‌య‌సు 49 సంవ‌త్స‌రాలు. ఈయ‌న తెలంగాణ‌కు చెందిన మంత్రి కేటీఆర్‌కు స‌మ‌కాలికులు. ఇరువురు కూడా ఒకే స్కూల్‌, కాలేజీలో విద్య‌ను అభ్యసించారు. ఇప్ప‌టికీ .. మిత్రులుగా కొన‌సాగుతున్నారు.

అయితే.. గౌతంరెడ్డి .. గ‌త వారం రోజులుగా దుబాయ్‌లో ఉన్నారు. అక్క‌డ జ‌రిగిన పెట్టుబ‌డుల స‌ద‌స్సు లో మేక‌పాటి పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌టి రెండు రోజులు న‌ల‌త‌గా ఉంద‌ని.. రెస్ట్ తీసుకున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆదివారం ఉద‌యం ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన మంత్రి మేక‌పాటి మంగ‌ళ‌వారం.. తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంది. అదే విధంగా పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు సంబంధించి.. మంత్రివ‌ర్గ బృందానికి కూడా ఆయ‌న వివ‌రించాల్సి ఉంది. అయితే..అనూహ్యంగా ఆయ‌న గుండెపోటుకు గురికావ‌డం.. తుదిశ్వాస విడ‌వ‌డం.. కుటుంబాన్ని తీవ్రంగా క‌లిచివేస్తోంది.

మాజీ ఎంపీ..నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడైన గౌతంరెడ్డి.. ఉన్న‌త విద్యావంతుడు. అంతేకాదు. వివాద ర‌హితుడిగా రాజ‌కీయాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అంటేనే రెడ్డి డామినేష‌న్ రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. కానీ, మంత్రి మేక‌పాటి మాత్రం ఈ డామినేష‌న్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. గ‌తంలో త‌న తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి మాదిరిగానే గౌతం రెడ్డి కూడా.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల‌కు ఉప‌యోప‌డే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు.