జనసేనను ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మేశారు

జనసేనను ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మేశారు

వైసీపీ కీలక నేత, జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) వైసీపీ సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కీలకమేనని చెప్పాలి. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పేర్ని నాని అంటే... వైసీపీ సర్కారు ఏర్పాటయ్యేదాకా అంతగా పరిచయం లేని నేతే. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా... విషయ పరిజ్ఝానంలో దిట్టగా ఉన్నా... మంచి ఎలివేషన్ లభించకపోవడంతో పేర్ని నాని అలా ఉండిపోయారు. అయితే జగన్ సీఎం అయ్యాక... ఆయన కేబినెట్ లో చోటు సంపాదించుకోవడంతో పాటుగా ఏకంగా సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిత్వ శాఖను చేజిక్కించుకున్న నాని... తనలోని సత్తాను బయటపెట్టేశారు. పేర్ని నాని మీడియా ముందుకు వస్తున్నారంటే... ప్రత్యర్థి వర్గానికి తడిసిపోవాల్సిందేనన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి తరుణంలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన నాని... బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనపై తనదైన శైలి పంచ్ సంధించారు. నాని విసిరిన ఈ పంచ్ జనసేనాని పవన్ కల్యాణ్ కు దిమ్మ తిరిగిపోయేలా చేసిందని చెప్పక తప్పదు.

అయినా పేర్ని నాని... పవన్ కల్యాణ్ పై ఏమని పంచ్ విసిరారంటే.... జనసేనను ఇక ఓఎల్ ఎక్స్ లో పెట్టుకోవాల్సిందేనంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడిన పవన్ వైఖరిని ప్రస్తావించిన పేర్ని... ఒకానొక దశలో బీజేపీ ఓకే అనడమో, లేదంటే జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని కోరడమో జరిగి ఉంటే గనుక... ఈ పాటికి జనసేన ఉనికే లేకుండా పోయేదన్న వార్తలను కూడా ప్రస్తావించారు. 25 ఏళ్ల ప్రస్థానమంటూ బీరాలు పలికిన పవన్ వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా నాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 25 ఏళ్ల పాటు పార్టీని నడుపుతానంటూ బీరాలు పలికిన పవన్... ఆరేళ్లకే తన పార్టీని బీజేపీతో కలిసి సాగేలా ఎలా చేయగలిగారంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన నాని... జనసేనను ఓఎల్ ఎక్స్ పెడిసే సరి అంటూ తనదైన శైలి సెటైర్ సంధించారు.

ఇంకా పేర్ని ఏమన్నారంటే... సరే ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలుస్తున్నారు కదా... ప్రత్యేక హోదా కోసం ఓ రేంజిలో పోరాడారు కదా... మరి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే తాను బీజేపీతో జట్టుకడతానని మోదీ అండ్ బ్యాచ్ కు ఓ కండీషన్ పెట్టవచ్చు కదా అని కూడా పవన్ కు పేర్ని సూచించారు. ప్రత్యేక హోదా అంశాన్ని అసలు తనకు గుర్తు లేదన్నట్లుగా వ్యవహరించిన పవన్... ఏ షరతులు లేకుండా బీజేపీతో ఎలా కలుస్తారని కూడా పేర్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలుస్తున్నానని చెప్పిన పవన్... సింగిల్ షరతు లేకుండా బీజేపీతో జట్టుకట్టడం చూస్తుంటే... జనసేనను ఓఎల్ఎక్స్ లో పెట్టడం మినహా గత్యంతరం లేదని తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English