నేడు అమరావతికి బాలయ్య... సీమ స్పందన ఎమిటో?

నేడు అమరావతికి బాలయ్య... సీమ స్పందన ఎమిటో?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు సాగిస్తున్న ఉద్యమం సోమవారానికి 30వ రోజుకు చేరుకుంది. రాజధాని రైతులు సాగిస్తున్న ఉద్యమానికి విపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాలు మద్దతు పలికాయి. ఉద్యమం అంతా టీడీపీ భుజాలపై నుంచే నడుస్తోందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. అయితే నెల రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమంలో చంద్రబాబు వియ్యంకుడు, రాయలసీమలోని అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా అమరావతిలో కనిపించలేదు. అయితే సోమవారం బాలయ్య అమరావతికి వస్తున్నారని, సతీ సమేతంగా తరలిరానున్న బాలయ్య రాజధాని రైతుల ఆందోళనలకు ఆయన తన సంపూర్థ మద్దతు ప్రకటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే జరిగితే... అసలే టీడీపీకి ఘోర పరాభవం ఎదురైన రాయలసీమలో ఆ పార్టీకి ఈ పరిణామం ఎలా పరిణమిస్తుందోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో నాలుగు జిల్లాల రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా... చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబు నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే... హిందూపురంలో బాలయ్య, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమిపాలైంది. అంటే... ఏ లెక్కన చూసినా... రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒక్క అనంతపురం జిల్లాలోనే టీడీపీకి ఓ మోస్తరు బలముందని చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య... అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తే... సీమలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ తప్పదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అమరావతి రైతులకు బాలయ్య మద్దతు పలికితే... ఈ పరిణామం ఒక్క అనంతపురం జిల్లాలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్నదే కాకుండా స్వయంగా బాలయ్యకు వచ్చే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదా? అన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు బాలయ్యను హిందూపురం నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. బాలయ్యకేమీ సొంతంగా బలం లేకున్నా... టీడీపీకి ఉన్న కేడర్, బాలయ్య టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయుడన్న కోణం కూడా బాలయ్యకు కలిసి వచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తనను అసెంబ్లీకి పంపిన హిందూపురం ప్రాంత ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అమరావతి ఉద్యమంలోకి బాలయ్య రంగప్రవేశం చేస్తే దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English