బీజేపీ, జనసేన భేటీ... కన్నా, పీకే ఉమ్మడి ప్రకటన ఏంటంటే?

బీజేపీ, జనసేన భేటీ... కన్నా, పీకే ఉమ్మడి ప్రకటన ఏంటంటే?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీలు ఇకపై కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఈ రెండు పార్టీల మధ్య జరిగిన కీలక భేటీలో ఆ పార్టీలు ఉమ్మడిగా కలిసి సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం మద్యాహ్నం సుధీర్ఘంగా సాగిన భేటీలో బీజేపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దేవ్ ధర్, జీవీఎల్ నరసింహారావు, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు హాజరు కాగా... జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, కీలక నేత నాదెండ్ల మనోహర్ లు హాజరయ్యారు. భేటీ అనంతరం తాము తీసుకున్న నిర్ణయాలు ఇవేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.  

ఆ ప్రకటనలో వారిద్దరూ ఏమని పేర్కొన్నారన్న విషయానికి వస్తే... ‘రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ రాజకీయంగా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించడం జరిగింది. అనేక జాతీయ, రాష్ట్ర విషయాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత రెండు పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రదానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి అందిస్తున్న సమర్థవంతమైన, అవినీతి రహిత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగల ధృఢమైన పాలనను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్వాగతించారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో నెలకొన్న లోపభూయిష్ట నిర్ణయాలను ఈ రెండు పార్టీలూ ఖండించాయి. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ విశ్వాసంతో తెలుగు దేశం పార్టీకి పట్టం కట్టారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఇప్పటి ఈ ఆందోళనకర పరిస్తితికి అప్పటి ప్రభుత్వం కారణమైంది. అవినీతిలో కూరుకుపోయి, కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలిచ్చారు.

మార్పును ఆకాంక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2019 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అందివ్వడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యలకే పరిపాలనను పరిమితం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. సుపరిపాలన కోసం ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కనుక ఏ పార్టీ అధికారానికి వచ్చినా ప్రభుత్వ విధానాలను కొనసాగించాల్సిన బాధ్యత వర్తమాన ప్రభుత్వంపై ఉంటుంది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ అనేక ప్రజాకంటక నిర్ణయాలు చేస్తున్న సందర్బంలో పెట్టుబడులు రాక, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి రాష్ట్ర ప్రగతి కుంటుపడిన విషయాన్ని రెండు పార్టీలు గుర్తించాయి.

గతంలోని తెలుగు దేశం ప్రభుత్వం, వర్తమాన వైసీపీ ప్రభుత్వం కులం, కుటుంబ రాజకీయాలకు, పరస్పర దూషణలకు పరిమితం అవుతూ స్వలాభాపేక్షతో అవినీతిలో కూరుకుపోయి రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచాయి. నవ్యాంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే దిశగా జాతీయ దృక్పథం నిండిన ఈ కూటమి పనిచేయాలని నిశ్చయించింది. విలువలతో కూడిన నాయకత్వాన్ని అందిస్తూ మరియు యువతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పీపీఏల విషయాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున అందిన ప్రోత్సాహకాల గురించి లోతుగా చర్చించుకోవడం జరిగింది. ఈ విషయాలపైనా కూలంకషంగా చర్చించి ఒక అవగాహనతో భవిష్యత్ కార్యాచరణపై కూటమి ఓ నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యలపై లోతుగా అవగాహన చేసుకుని వాటి పరిష్కారం కోసం ఇరు పార్టీలూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. పరస్పర సమన్వయంతో ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల మన్ననలను చూరగొని 2024 సంవత్సరానికి అధికారంలోకి రాగలమనే ధీమాను వ్యక్తపరచడం జరిగింది’ అంటూ ఆ సంయుక్త ప్రకటనలో కన్నా, పీకే పేర్కొన్నారు.

మొత్తంగా విషయాలు చాలానే చర్చకు వచ్చినా... ఈ రెండు పార్టీల మధ్య పొత్తు... 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ కూటమి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భేటీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క వైసీపీపైనే నిందలు మోపకుండా... అటు గత ప్రభుత్వం టీడీపీపైనా తమదైన విమర్శలు చేసిన బీజేపీ, జనసేన కూటమి... ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీ కూడా కారణమేనని ముక్తాయించడం గమనార్హం. అంతేకాకుండా... ప్రస్తుతం రాజధాని విషయంపై నెలకొన్న ఉద్యమాలు, ఉద్రిక్త పరిస్థితులకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని, అయినా కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటిని సరిదిద్దడానికి బదులుగా ఉద్రిక్తలు పెరిగే దిశగా పాలన సాగిస్తోందని ఈ కూటమి అభిప్రాయపడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English