బీజేపీతో దోస్తీ... పీకేకు ‘లెఫ్ట్’ హ్యాండిచ్చేసినట్టే

బీజేపీతో దోస్తీ... పీకేకు ‘లెఫ్ట్’ హ్యాండిచ్చేసినట్టే

తెలుగు నేల రాజకీయాలను మలుపు తిప్పుతానంటూ బీరాలు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గట్టి దెబ్బే తగిలింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి పవన్ కు చాలా కాలమే పట్టినా... పరిస్థితిని మెరుగుపరచుకునే దిశగా ఆయన చేస్తున్న యత్నాలు అంతలా సత్ఫలితాలను ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే కార్యాచరణ మొదలెట్టినట్లుగా కనిపిస్తున్న పవన్ తీసుకున్న తాజా నిర్ణయం ఆయనకు మరో దెబ్బేసిందనే చెప్పక తప్పదు.

 ఏపీలో తన పార్టీకి ఏ మేర బలముందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే కాస్తంత అర్థం చేసుకుంటున్న పవన్... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకు, లేదంటే ఏకంగా ఆ పార్టీలో తన పార్టీని కలిపేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పవన్ కు ఏ మేర ఉపయోగపడుతుందో తెలియదు గానీ... ఆ పార్టీతో ఇంకా సంధి కుదరకముందే... పవన్ తో ఇప్పటికే కలిసి నడుస్తున్న వామపక్షాలు జనసేన దోస్తానాకు ముగింపు పలకనున్నాయి.

అంటే.. బీజేపీతో దోస్తానా ఫలితంగా వామపక్షాలు పవన్ కు హ్యాండిచ్చేసినట్టేనని చెప్పక తప్పదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి సాగిన పవన్.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి అటు బీజేపీకి, ఇటు టీడీపీకి దూరంగా జరిగారు. ఈ నేపథ్యంలో పవన్ తో వామపక్షాలు స్నేహగీతాన్న ఆలపించాయి. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐలతో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో కలిసి సాగిన పవన్... ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు.

తాను నిలబడ్డ రెండు చోట్లా పవన్ ఓడిపోగా... టీడీపీతో పవన్ అంతర్గత పొత్తుల కారణంగా ఇటు వామపక్షాలు, అటు బీఎస్పీలకూ సున్నా మార్కులే పడ్డాయి. ఇక జనసేన ఖాతాలో సింగిల్ సీటు పడ్డా... అది కూడా జనసేన ప్రభావంతో కాకుండా సదరు అభ్యర్థి వ్యక్తిగత ఇమేజీతోనే గెలుపొందారన్న వాదనలుే వినిపించాయి. మొత్తంగా 2019 ఎన్నికల్లో పవన్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టేసింది.

2014, 2019 ఎన్నికల నాటి పరిస్థితులను బాగానే విశ్లేషించుకున్న పవన్... ఏపీలో తనకు ఏపాటి బలముందో తెలుసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీతోనో, లేదంటే అటు బీజేపీతోనో దోస్తీ కడితే తప్పించి తాను నెట్టుకురాలేనని పవన్ ఓ అభిప్రాయానికి వచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ బీజేపీకి దగ్గరగా జరిగారు. మతతత్వ పార్టీ ముద్ర ఉన్న బీజేపీతో పవన్ దోస్తానా మొదలెడతారన్న మాట బయటకు రాగానే... జనసేనతో దోస్తానాకు కటీఫ్ చెప్పాల్సిందేనని వామపక్షాాలు నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే సీపీఐ పవన్ తో స్నేహానికి చరమ గీతం పాడేసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. సోమవారం బీజేపీతో జనసేన భేటీ తర్వాత సీపీఎం కూడా జనసేనతో దోస్తానాకు చెక్ పెట్టడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీతో దోస్తానా కారణంగా జనసేనకు వామపక్షాలు దూరమయ్యే పరిస్థితులు వచ్చాయన్న మాట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English