6 గంటల మీటింగ్... కేసీఆర్, జగన్ ఏం డిసైడ్ చేశారంటే..

 6 గంటల మీటింగ్... కేసీఆర్, జగన్ ఏం డిసైడ్ చేశారంటే..

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ల సమావేశం సుదీర్ఘంగా సాగింది. సుమారు ఆరు గంటల పాటు సమావేశం జరగడంతో రాజకీయంగా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే, ఈ సమావేశంలో విభజన చట్టం 9,10 షెడ్యూళ్లలోని సంస్థల అంశాలు, గోదావరి జలాల మళ్లింపు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఎన్పీఆర్, ఎన్నార్సీ.. తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంపై ఏపీ ప్రభుత్వం వివరాలు వెల్లడిస్తూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. కృష్ణా నదిలో నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపారు.

''కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకే రకంగా ఉండడం లేదు. చాలా సందర్భాల్లో కృష్ణా నది ద్వారా నీరు రావడం లేదు. దీంతో కృష్ణా నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందడం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య.

దీనివల్ల అటు రాయలసీమ, ఇటు పాలమూరు, నల్గొండ వ్యవసాయ భూములకు ఖచ్చితంగా నీరు అందుతుంది. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి. దీని వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు'' అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణయం కుదిరిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English