రెంటికీ చెడిన పృథ్వీ.. ఏమవుతాడో?

రెంటికీ చెడిన పృథ్వీ.. ఏమవుతాడో?

కమెడియన్ టర్న్డ్ పొలిటీషయన్ పృథ్వీ ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయాడు. ఊహించని విధంగా అతను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన సచ్ఛీలతను నిరూపించుకుని మళ్లీ ఆ పదవిని చేపడతానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు కానీ.. అది జరిగే పనిలా కనిపించడం లేదు.

లీక్ అయిన ఫోన్ సంభాషణలో ఉన్నది తన వాయిస్ కాదని పృథ్వీ అంటున్నాడు కానీ.. దీన్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. పోసానితో గొడవ, అమరావతి రైతులపై అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యల కారణంగా పృథ్వీ ఇప్పటికే పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. జగన్ సైతం అతడిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీ మరికొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు.

ఈ పరిస్థితుల్లో పృథ్వీ అంత ముఖ్యమైన నాయకుడేమీ కాదు కాబట్టి.. వైకాపా అతడికి మళ్లీ అవకాశం ఇస్తుందని అనుకోలేం. ఇంతకుముందు అంబటి రాంబాబు సైతం ఇలాంటి సరస సంభాషణల ఆడియోతో అన్ పాపులర్ అయ్యాడు. ఐతే ఆయన ముందు నుంచి పార్టీ జెండా మోసిన వ్యక్తి. పృథ్వీతో పోలిస్తే పెద్ద నాయకుడు. జనబలం ఉంది. కాబట్టి కొన్నాళ్లు ప్రాధాన్యం తగ్గించి జనాలు ఆ వ్యవహారం మరిచిపోయాక పార్టీలో పెద్ద పీట వేశారు. పృథ్వీ స్థాయిని బట్టి చూస్తే అలా జరిగే అవకాశం ఎంతమాత్రం లేదు. తన స్థాయికి మించిన పదవి దక్కిందని మురిసిపోయిన పృథ్వీకి ఆ పదవి ఆరు నెలల ముచ్చటే అయింది.

పొలిటికల్ కెరీర్ ముగిసిపోయింది కదా.. మళ్లీ వెళ్లి సినిమాలు చేసుకుందామన్నా అక్కడా అతడికి పెద్దగా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. కమెడియన్‌గా ఒక దశలో పీక్స్ అందుకున్న పృథ్వీ దాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు. ఆల్రెడీ అవకాశాలు తగ్గిపోయాయి. పైగా ఎన్నికలకు ముందు, తర్వాత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీకి యాంటీ అయిపోయాడు. అతడి మీద ఇండస్ట్రీలోనూ వ్యతిరేకత ఏర్పడి పాత్రలు ఇవ్వడం తగ్గించేశారు. ఇప్పుడు బాగా అన్ పాపులర్ అయి మళ్లీ సినిమాల వైపు చూస్తే అతణ్ని ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు పృథ్వీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English