స‌ర్కార్ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ఆఫ‌ర్స్ ఇవే

స‌ర్కార్ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ఆఫ‌ర్స్ ఇవే

విశాఖ కేంద్రంగా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిపాల‌న కొన‌సాగించేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న‌మోహ‌న్ కృత‌నిశ్చ‌యంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ర‌క‌ర‌కాల ప్ర‌క్రియ‌లు కొన‌సాగిపోతున్నాయి. ఇవాళ ఏపీలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. రాజధాని మార్పు విషయంలో హైపవర్ కమిటీ భేటీ అయింది. ఇందులో రాజ‌ధాని త‌ర‌లింపుపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ఉద్యోగికి 200 గజాల స్థలం కేటాయింపు ప్రతిపాదనలను హై పవర్ కమిటీ చేసినట్టు తెలుస్తోంది. కేవ‌లం స్థ‌ల‌మే కాకుండా, ఉచిత నివాస వసతి, కుటుంబంతో సహా తరలి వస్తే.. నెలకు రూ.4 వేల చొప్పున రాయితీ అద్దె చెల్లించాలని ప్రతిపాదించినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలు, రాజధాని మార్పు విషయంలో తుది నిర్ణ‌యానికి ప్ర‌తిపాద‌న‌లు అందించేందుకు హైపవర్ కమిటీ భేటీ అయింది. పదిమంది మంత్రులు, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రైతులకు న్యాయం, జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై ఈరోజు ఈభేటీలో చర్చించారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగుల‌కు పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నాలు ప్ర‌తిపాదించిన‌ట్లు తెలుస్తోంది.

వారానికి ఐదు రోజుల పనిదినాల కొనసాగింపు, ఉద్యోగుల‌కు తక్షణం వేతన సవరణ, 30 శాతం  హెచ్ఆర్ఏ, 10శాతం సీసీఏ, ఇంటి సామాన్ల తరలింపు కోసం హోదా బట్టి లక్ష నుంచి 50 వేలు అందజేయాలని హైప‌వ‌ర్ క‌మిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతోపాటుగా, అమరావతిలో ఇచ్చినట్టే బస్సు, రైలు ప్రయాణ రాయితీని కొనసాగించడం, ఉద్యోగుల పిల్లలకు విద్యా సంస్థల్లో డొనేషన్లు లేకుండా సీట్లు... అవసరమైతే సూపర్ న్యూమరీ సీట్లు పెంచేలా నిర్ణయం, స్వచ్చంద పదవీ విరమణ నిబంధనను 28 ఏళ్లకు బదులుగా.. 25 లేదా 26 ఏళ్లకు కుదించే ప్రతిపాదనలు, స్థానికత అంశంపై 2024 వరకు గడువు పెంపుదల వంటివి హైప‌వ‌ర్ క‌మిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కాగా, ఈనెల 20 వ తేదీలోగా ఈ కమిటీ తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English