అమరావతికి వెళ్తే చెప్పులతో కొడతారు-పోసాని

అమరావతికి వెళ్తే చెప్పులతో కొడతారు-పోసాని

మూడు రాజధానుల ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులకు తెరతీసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. చంద్రబాబు ఏరి కోరి రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి విషయంలో జగన్ సర్కారు పూర్తి వ్యతిరేకతతో ఉన్న సంగతి తెలిసిందే. అమరావతిని మూడు రాజధానుల్లో ఒకటిగా చెబుతున్నప్పటికీ.. దానికి ఎంతగా వీలైతే అంతగా ప్రాధాన్యం తగ్గించి విశాఖపట్నాన్ని ప్రధాన రాజధానిగా మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఐతే తమ నుంచి వేల ఎకరాల్లో భూములు తీసుకుని, ఎన్నో ఆశలు కల్పించి.. ఇప్పుడు రాజధానిని మార్చడం పట్ల రాజధాని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాలుగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఐతే వారి నిరసనల్ని సర్కారు పట్టించుకోవట్లేదు. పైగా అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది నిజమైన రైతులు కాదని, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అని వైకాపా నాయకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన నటుడు పృథ్వీ కూడా ఇదే మాట అన్నాడు.

ఐతే ఎన్నికల ముందు వైకాపాకు ప్రచారం చేసి, ఇప్పటికీ ఆ పార్టీ మద్దతుదారుగానే ఉన్న పోసాని కృష్ణమురళి మాత్రం ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేసి ఉండొచ్చని, కానీ అమరావతి రైతులు తమ గోడు వెల్లబోసుకుంటూ ఉంటే వాళ్లను పెయిడ్ ఆర్టిస్టులు అనడం ఎంతమాత్రం సమంజసం కాదని పోసాని అన్నాడు. ఇప్పుడు తాను గనుక అమరావతికి వెళ్తే కచ్చితంగా అక్కడి జనాలు చెప్పులతో కొడతారని పోసాని అన్నాడు.

వాళ్ల బాధలో న్యాయం ఉందని పోసాని చెప్పాడు. వాళ్ల విషయంలో పెయిడ్ ఆర్టిస్టులంటూ చేసిన వ్యాఖ్యలకు తమ పార్టీ తరఫున తాను క్షమాపణ చెబుతున్నానన్నాడు. ఇప్పుడు జగన్ హైకోర్టును రాయలసీమలో పెడతానంటుున్నాడని.. కాబట్టి అది రెడ్ల కోసం పెడుతున్నాడని అనలేమని.. అలాగే అమరావతితో రాజధాని పెట్టడం కమ్మవాళ్ల కోసం అనడం కూడా తప్పే అని పోసాని కుండబద్దలు కొట్టాడు. అమరావతితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మాత్రం తప్పని ఈ సందర్భంగా పోసాని అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English