నాగార్జునను మ‌ళ్లీ ఆడుకున్న నారాయ‌ణ‌

బిగ్‌బాస్‌…ఈ షో పాపులారిటీ గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. అదే స‌మ‌యంలో దీనిపై వివాదాలు కూడా తెలిసిన సంగ‌తే. తెలుగులో బిగ్ బాస్- 5 పూర్తి అయి దాదాపు రెండు నెలలు కావ‌స్తున్న స‌మ‌యంలో మరో సీజ‌న్‌కు శ్రీ‌కారం చుట్టారు. మునుప‌టిలా టీవీలో కాకుండా ఓటీటీలో వ‌చ్చే ఈ కొత్త సీజ‌న్‌పై అప్పుడే కామెంట్లు మొద‌ల‌య్యాయి. దీనిపై స్పందించింది ఎవ‌రో కాదు.. బిగ్ బాస్ అంటేనే క‌స్సున లేచే సీపీఐ నేత నారాయ‌ణ‌.

ఇటీవ‌ల బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ షోలో ఉరిశిక్ష ప‌డే ఖైదీ అయిన వెన్నెల కిశోర్ బిగ్‌బాస్ చూడాల‌ని అనుకుంటాడు. దీంతో ఉరిశిక్ష‌ను సైతం వాయిదా వేసి ఆయ‌న‌కు బిగ్ బాస్ చూసే చాన్సిస్తారు.

అంతేకాకుండా జైల్లోని సిబ్బంది, అధికారులు కూడా ఆయ‌న‌తో క‌లిసి ఈ షో చూస్తారు. దీనిపైనే నారాయ‌ణ‌కు మండిపోయింది. `ఉరిశిక్ష పడే ఖైదీకి సైతం ఆ శిక్ష‌ అమలు వాయిదావేసి #బిగ్ బాస్”చూసేందుకు అనుమతిస్తారు. ఇది ప్రముఖ హీరో నాగార్జున వాణిజ్య ప్రకటన. బిగ్ బాస్ సమాజానికేం సందేశం ఇస్తుంది ???  మీరేసమాదానం చెప్పాలి“ అంటూ త‌న‌దైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.

ఇటీవ‌లే నాగార్జున‌పై త‌న‌కున్న కోపం, అక్క‌సు అన్నింటినీ ఓ షోలో నారాయ‌ణ వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున ఏం సందేశం ఇవ్వాల‌నుకుంటున్నారని నారాయ‌ణ నిల‌దీశారు. ఈ షో విష‌యంలో తాను  తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్పుడు ఏకంగా ప్రోమోపై స్పందించారు. బిగ్‌బాస్ పై మిగ‌తా వారికంటే నారాయ‌ణ‌కే ప్ర‌త్యేకంగా ఆస‌క్తి ఉన్న‌ట్లుంద‌ని కొంద‌రు కామెంట్ చేయ‌డం కొస‌మెరుపు. మ‌రోవైపు బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు  పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.