ఆ విద్యార్థుల పై దాడి చేసింది మేమే

ఆ విద్యార్థుల పై దాడి చేసింది మేమే

సైద్ధాంతిక విబేధాలు ఉండొచ్చు. అంత మాత్రాన అనాగరికంగా వ్యవహరించటాన్ని క్షమించాలా? తప్పు ఎవరూ చేసినా వేలెత్తి చూపించాలి. హద్దులు దాటే వారిని కంట్రోల్ చేయాలి. ఈ దేశంలో ఎవరూ ప్రత్యేకమైన వ్యక్తులు కాదు. అందరూ సమానమే. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న స్వాతంత్య్రం కళ్ల ముందు కరిగిపోతుంటే ఎవరూ ఊరుకోకూడదు. ఇప్పటికే మతం.. ప్రాంతం.. కులం పేరుతో దరిద్రపుగొట్టు రాజకీయాలు చేస్తున్న వారిని చట్టప్రకారం శిక్ష పడేలా చేయాల్సిన అవసరం చాలా ఉంది.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రఖ్యాత జేఎన్ యూ వర్సిటీలో ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి విద్యార్థుల మీద దారుణమైన దాడికి పాల్పడింది తామేనని.. అందుకు బాధ్యత అంతా తమదేనంటూ హిందూ రక్షాదళ్ అధినేత భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

తామెందుకు దాడి చేశామన్న విషయానికి ఆయన ఇచ్చిన వివరణ అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. ఏ మాత్రం క్షమించకూడదన్నట్లుగా ఉంది. ఇంతకీ తామెందుకు దాడి చేసిందన్న విషయాన్ని చెబుతూ.. జేఎన్ యూ కమ్యునిస్టులకు హబ్ గా మారిందని.. హిందూ మతాన్ని.. దేశాన్ని వారు కించపరుస్తున్నారని.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

అలాంటి వాటిని తాము సహించబోమని.. భవిష్యత్తులో మరే విశ్వవిద్యాలయంలో అయినా సరే దేశ వ్యక్తిరేక కార్యకలాపాలు జరిగితే అక్కడ కూడా ఇలాంటి చర్యలే చేపడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్రలు.. ఇనుప రాడ్లు పట్టుకొని.. ఇష్టారాజ్యంగా విధ్వంసం చేస్తూ.. ఎక్కడికక్కడ తీర్పులు ఇచ్చేటట్లైయితే.. ఈ కోర్టులు.. చట్టాలు.. చట్టసభలు ఎందుకు అన్న ప్రశ్నను భూపేంద్రను అడగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఇలాంటి విధ్వంసకారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడే వైనం పెరిగిపోతున్న వేళ.. మనసుకు తోచినట్లుగా భౌతిక దాడులు చేయటమే లక్ష్యమైతే.. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? అన్నది ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English