ఈ టీఆర్ఎస్ ఎంపీకి బాల‌య్య‌తో దోస్తీ దూరం కాలేదు

ఈ టీఆర్ఎస్ ఎంపీకి బాల‌య్య‌తో దోస్తీ దూరం కాలేదు

రాజ‌కీయాలు రాజ‌కీయాలే. వ్య‌క్తిగ‌త సంబంధాలు వ్య‌క్తిగ‌త‌మే. సేవా కార్య‌క్ర‌మాల్లో ఆస‌క్తి ఉంటే, అవి మ‌ళ్లీ ప్ర‌త్యేకం. ఇలాంటి వాటికి పార్టీలు, రాజ‌కీయాలు, ప్రాంతాల‌తో సంబంధమే లేదు. తాజాగా ఈ మాట‌ను ఓ టీఆర్ఎస్ ఎంపీ నిరూపించారు. ఆయ‌నే ఒక‌నాడు టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు న‌మ్మిన‌బంటుగా పేరొంది అనంత‌రం టీఆర్ఎస్‌లో చేరిన ఎంపీగా గెలుపొందిన ఖ‌మ్మం పార్ల‌మెంటు స‌భ్యుడు నామా నాగేశ్వ‌ర‌రావు. తాజాగా ఆయ‌న చంద్ర‌బాబు బావ‌మ‌రిది, తెలుగుదేశం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి కీల‌క కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యుడిగా డా. రాఘవరావు పోలవరపును నియమించారు. ఈ మేర‌కు బాల‌య్య‌తో క‌లిసి నామా నాగేశ్వ‌ర‌రావు నియామ‌క ప‌త్రం అందించారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు స్థాపనలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజనేషన్, అమెరికా సంస్థకు అధ్యక్షునిగా నియమితులైన డా. రాఘవరావు పోలవరపు ఇటీవలే మరణించిన ట్రస్టు బోర్డు సభ్యురాలు డా. తులసీదేవి పోలవరపు జీవిత భాగస్వామి. స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు అందుకొని  న్యూయార్క్‌లో వైద్యులుగా స్థిరపడిన డా.రాఘవరావు దంపతులు అమెరికాలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ స్థాపించి హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు అవసరమైన నిధులు సేకరణలో కీలక భూమిక పోషించారు.

అనంత‌రం సంస్థ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగిన డా. తులసీదేవి నేతృత్వంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనేషన్ సంస్థకు వివిధ రూపాలలో నిధుల సహాయాన్ని అందిస్తూ హాస్పిటల్ నేడు భారతదేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ఎంతో దోహదపడ్డారు. ఇలా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరిస్తున్న డా. తులసీదేవి మరణానంతరం ఆ స్థానాన్ని డా. రాఘవరావు పోలవరపుతోనే భర్తీ చేయాలని భావించిన సంస్థ ట్రస్టుబోర్డు నేడు డా. రాఘవరావు పోలవరపు నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది.  దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని ట్రస్టు బోర్డు సభ్యులు నామా నాగేశ్వర రావు, జెయస్ ఆర్ ప్రసాద్, భరత్ మితుకుమల్లి సమక్షంలో ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అందించి డా. రాఘవరావు పోలవరపును అభినందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English