విజయసాయిరెడ్డి వర్సెస్ రామ్మోహన్ నాయుడు.. మధ్యలో జగన్

విజయసాయిరెడ్డి వర్సెస్ రామ్మోహన్ నాయుడు.. మధ్యలో జగన్

రాజధాని నుంచి రాష్ట్రాభివృద్ధి వరకు ప్రతి అంశంలోనూ పాలక వైసీపీ, విపక్ష టీడీపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తప్పు మీదంటే మీదంటూ నాయకులు ఒకరిపై ఒకరు మాటలు విసురుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ లోక్ సభ సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు మధ్యా ఓ పరోక్ష యుద్ధం మొదలైంది. అయితే.. వీరిద్దరూ తప్పులను ఒకరిపై ఒకరు నెట్టుకోవడం కాకుండా గొప్పలు చెప్పుకోవడానికి పోటీ పడుతున్నారు. గత ఏడాది పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను సోమవారం భారత్‌కు అప్పగించనుండడంతో ఆ క్రెడిట్ నాదంటే నాదంటూ ఇద్దరూ నేతలూ ప్రెస్ మీట్లు పెడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, లైవ్‌లు ఇస్తూ క్రెడిట్ కొట్టేయడానికి ఆపసోపాలు పడుతున్నారు.

తమ దేశపు జైల్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం మత్స్యకారులను విడుదల చేసి వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించనున్నట్లు పాకిస్తాన్ సమాచారం ఇవ్వడం.. ఆ సమాచారాన్ని భారత విదేశీ వ్యవహారాలు, హోంశాఖలు ఆయా జిల్లా అధికారులకు చేరవేయడంతో ఇద్దరు నాయకులు, వారి అనుచరుల హడావుడి మొదలైంది. తాము అనేకసార్లు విదేశాంగ మంత్రికి, ఆ శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి, నిత్యం ఫాలో అప్ చేయడంతోనే వారు విడుదలవుతున్నారంటూ చెప్పుకొన్నారు.

సహజంగానే వైసీపీ ప్రస్తుతం ఫాంలో ఉండడంతో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇది తన ఘనతేనంటూ చేసిన ప్రకటన ప్రజల్లోకి వెళ్లింది. దీంతో శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అప్రమత్తమై తాను గతంలో ఎవరెవరిని కలిశారో ఆ ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లలో రుజువులుగా చూపించి అది తన ఘనతేనని ప్రకటించుకున్నారు. దీంతో ఇద్దరు ఎంపీల అనుచరులు సోషల్ మీడియాలో తమ నాయకుడి వల్లే ఇది సాధ్యమైందంటూ ప్రచారం మొదలుపెట్టారు.

సందడిలో సడేమియాలా వైసీపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తాజాగా ఈ క్రెడిట్‌ను జగన్‌కు ఇచ్చారు. సీఎం జగన్ దిల్లీ వెళ్లినప్పుడంతా మోదీని కలిసి మత్స్యకారుల విడుదలకు ప్రయత్నించాలని ఒత్తిడి చేయడం వల్లే ఇది సాధ్యమైందంటూ ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English