పంతం నెగ్గించుకున్న కోమ‌టి రెడ్డి..!

తెలంగాణ కాంగ్రెస్ ను ప‌ట్టిపీడిస్తున్న జాడ్యాలు వ‌ద‌ల‌డం లేదా..? ప‌రిస్థితి స‌వ్యంగా ఉంద‌నుకున్న‌ప్పుడ‌ల్లా మ‌రో ఉప‌ద్ర‌వం వ‌చ్చి ప‌డుతోందా..? కోమ‌టి రెడ్డితో రేవంత్ భేటీ పైపై ప‌టార‌మేనా..? వీరి భేటీ వెనుక ర‌హ‌స్య ఎజెండా మరొక‌టి ఉందా..? అదే అమ‌లైతే ప‌లువురు అభ్య‌ర్థుల‌కు ఆశ‌నిపాతంగా మారుతుందా..? అంటే అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నారు పార్టీ నేత‌లు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి కోమ‌టి రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ఆ ప‌ద‌విని అధిష్ఠానం రేవంత్ కు క‌ట్ట‌బెట్ట‌డంతో అప్ప‌టి నుంచీ అల‌క‌బూనారు కోమ‌టి రెడ్డి. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా రేవంత్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. రేవంత్ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్నంత వ‌రకూ గాంధీ భ‌వ‌న్ మెట్లు ఎక్క‌న‌ని శ‌ప‌థం చేశారు. మొన్న‌టి వ‌ర‌కూ రేవంత్ తో ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్నారు. కానీ రెండు రోజుల క్రితం కోమ‌టి రెడ్డితో రేవంత్ భేటీ కావ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి రేవంత్ తో భేటీలో త‌న పంతం నెగ్గించుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. వీరి మ‌ధ్య ర‌హ‌స్య ఎజెండాపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి ఇన్ని రోజులూ రేవంత్ తో విభేదించింది పీసీసీ చీఫ్ ప‌ద‌వి పైనే అయినా.. ఆయ‌న క‌లిసి ప‌నిచేసేందుకు కొన్ని డిమాండ్లు ముందుపెట్టార‌ట‌. రేవంత్ కుద‌ర‌ద‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డంతో అప్ప‌టి నుంచీ దూరంగా ఉంటున్నార‌ట‌. అయితే ఈ భేటీలో రేవంత్ కొంత‌ సానుకూల‌త వ్య‌క్తం చేయ‌డంతో కోమ‌టి రెడ్డి మెత్త‌బ‌డ్డార‌ట‌.

అయితే కోమ‌టి రెడ్డి డిమాండ్లు తెలుసుకున్న పార్టీ పెద్ద‌లు అవాక్క‌య్యార‌ట‌. ఎన్నిక‌ల‌ప్పుడు చూద్దాం.. ఇపుడు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించార‌ట‌. ఇంత‌కీ కోమ‌టి రెడ్డి డిమాండ్లు ఏమిటంటే.. క‌నీసం 20 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో తాను సూచించిన అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇవ్వాల‌ట‌. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ నగ‌ర్‌, రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో ఉన్న త‌న అనుచరుల‌కు టికెట్లు అడుగుతున్నార‌ట‌.

ఇన్ని రోజులూ వీరి భేటీకి ఆల‌స్యం ఈ కార‌ణ‌మేన‌ట‌. ఇపుడు రేవంత్ కొంత వెన‌క్కి త‌గ్గ‌డంతో కోమ‌టి రెడ్డి శాంతించార‌ట‌. ఇందులో మొద‌ట‌గా వినిపిస్తున్న‌ది జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి పేరు. కోమ‌టి రెడ్డి అనుచ‌రుడైన ఈయ‌న జ‌డ్చ‌ర్ల టికెట్ ఆశిస్తున్నారు. క్రితం ఎన్నిక‌ల్లో మ‌ల్లు ర‌వికి కేటాయించిన ఆ స్థానం కోసం అనిరుధ్ ప‌ట్టు ప‌డుతున్నారు. ఈ భేటీలో ఆయ‌న కూడా ఉన్నారు. దీంతో రేవంత్ కూడా సంసిద్ధ‌త‌ వ్య‌క్తం చేసి అనిరుధ్ ను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసుకోమ‌ని సూచించార‌ట‌. ఇలా కోమ‌టి రెడ్డి వ‌ర్గం ఎన్ని స్థానాల‌కు ఎస‌రు పెడుతుందో.. ఎవ‌రిని నిరాశ ప‌రుస్తారోన‌నే ఆందోళ‌న పార్టీ శ్రేణుల్లో ఉంద‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..?