నారా బ్రాహ్మ‌ణి...మంగ‌ళ‌గిరి...కొత్త చ‌ర్చ‌

నారా బ్రాహ్మ‌ణి...మంగ‌ళ‌గిరి...కొత్త చ‌ర్చ‌

'స‌మస్యలు చెప్పుకొనేందుకు కుప్పం ప్రజల్లాగే.. మంగళగిరి ప్రజలకూ మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి' ఈ మాట చెప్పింది నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో లోకేష్‌కు మద్దతుగా మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం నిర్వహించారు. ఆ స‌మ‌యంలోనే పై హామీ ఇచ్చారు. తామంతా ఇక్కడే ఉంటున్నామని.. మంగళగిరి నియోజకవర్గంలోనే ఇల్లు, ఓటు హక్కు ఉన్నాయని చెప్పారు. లోకేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె కోరారు. అయితే, ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే....తాజాగా మంగ‌ళ‌గిరిలో కొంద‌రు రైతుల ఆందోళ‌న‌లు, బ్రాహ్మ‌ణి స్పంద‌న తెరమీద‌కు వ‌స్తోంది.

అమరావతి తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో రైతుల కుటుంబాలకు చెందిన మహిళలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే, కొత్త సంవత్సరం ఆరంభం రోజున వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు..కేడర్ కు సైతం అదే విష‌యం సూచించిన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సారి తనతో పాటుగా సతీమణి భువనేశ్వరిని సైతం తీసుకెళ్తున్నారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో వీరి పర్యటన ఉండనుంది.

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబు త‌న స‌తీమ‌ణిని సైతం ఆందోళ‌న‌లో భాగం పంచుకునేలా చేయ‌డం రైతుల‌కు సంతోషం క‌లిగించేదే. అయితే, రాజ‌ధాని ప్రాంతం నుంచి బ‌రిలో దిగిన నేత స‌తీమ‌ణిగా...ప్ర‌జ‌ల కోసం త‌మ ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌ని ప్ర‌క‌టించిన నారా బ్రాహ్మ‌ణి ప్ర‌జ‌ల‌కు ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌నే సందేహం, చ‌ర్చ నెటిజ‌న్ల మ‌ధ్య‌ జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English