కూట‌మి కుదిరినా.. కేసీఆర్ ప్ర‌ధాని కాలేరా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. అందుకు మిగ‌తా ప్రాంతీయ  పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే దిశ‌గా వేగంగా సాగుతున్నారు. ప్ర‌ధాని మోడీని దేశం నుంచి త‌రిమికొట్టాల‌ని సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని అంటున్నారు. జ‌నాల మ‌ద్ద‌తు ఉంటే కొత్త జాతీయ పార్టీ పెట్టేందుకూ వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి కూట‌మి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాని పేర్కొన్నారు. అందుకు ఇప్ప‌టికే పశ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర సీఎంలు వ‌రుస‌గా మ‌మ‌తా బెన‌ర్జీ, స్టాలిన్‌, ఉద్ధ‌వ్‌తో మాట్లాడాన‌ని వెల్ల‌డించారు.

వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో వ‌చ్చిన బీజేపీపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. దీన్ని ఆస‌ర‌గా చేసుకున్న ఇత‌ర రాష్ట్రాల నేత‌ల‌తో క‌లిసి బీజేపీని దెబ్బ కొట్టాల‌ని కేసీఆర్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రంలో త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం చేసి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల‌ని అనుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా ప్ర‌ధాని మాత్రం కాలేర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకు అవ‌స‌ర‌మైన బ‌లం ఆయ‌న ద‌గ్గ‌ర లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

మ‌మ‌తా బెన‌ర్జీ, స్టాలిన్‌తో క‌లిసి ఇత‌ర కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర రాష్ట్రాల సీఎంల‌తో క‌లిసి కూట‌మి ఏర్పాటు దిశ‌గా కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిసింది. అయితే మూడో కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప్ర‌ధాని అయ్యేదెవ‌రూ? ఎవ‌రి పేరును తెర‌పైకి తెచ్చి ఓట్లు అడుగుతారు? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మూడో కూట‌మి త‌ర‌పున ప్ర‌ధాని ఎవ‌రు అనేది ముందు తేలాల్సి ఉంటుంది. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచే ప్ర‌ధాని ఉండాల‌నే డిమాండ్ కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్‌కూ ఆ ముచ్చ‌ట ఉంది.

కానీ అది సాధ్యం అయేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే తెలంగాణ‌లో కేవ‌లం 17 లోక్‌స‌భ సీట్లు మాత్ర‌మే ఉన్నాయి. అదే పశ్చిమ బెంగాల్‌లో అయితే 42, త‌మిళ‌నాడులో అయితే 39 ఉన్నాయి. మ‌రోవైపు ఆయా రాష్ట్రాల్లో మ‌మ‌త‌, స్టాలిన్‌కు ఉన్న బ‌లం ఎక్కువ‌. మ‌రోవైపు మోడీకి తానే స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని భావిస్తున్న మ‌మ‌త దేశ‌వ్యాప్తంగా పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా మ‌మ‌త‌నే ప్ర‌ధాని అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.