మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్ ఫేకా?

మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్ ఫేకా?

నిన్న తెలుగు రాష్ట్రాల్లో.. సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశమైన విషయం.. జగన్ సర్కారు ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలుపుతూ రిలీజ్ చేసినట్లుగా భావిస్తున్న ప్రెస్ నోటే. ఓవైపు చిరు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జగన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పటికే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. నాగబాబు సైతం తమ్ముడికి అండగా నిలబడ్డాడు.

ఇలాంటి సమయంలో చిరు తమ్ముళ్ల మనోభావాలకు, జనసేన పార్టీ స్టాండ్‌కు పూర్తి భిన్నంగా స్టేట్మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఏ ఉద్దేశంతో ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడన్నది అంతుబట్టడం లేదు. రాజకీయంగా పవన్‌కు అండగా నిలబడకపోయినా పర్వాలేదు కానీ.. అతణ్ని ఇలా ఇరుకున పెట్టేలా స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల మెగా అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిరు స్టేట్మెంట్‌ను పట్టుకుని ఆయన్ని, పవన్‌ను వ్యతిరేకించేవాళ్లు నిన్న సాయంత్రం నుంచి తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఐతే వాళ్లకు ఎలా బదులివ్వాలో తెలియని జనసైనికులు, మెగా అభిమానులు.. అసలు చిరు స్టేట్మెంట్ ఒరిజినల్ కాదు.. ఫేక్ అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. చిరు లెటర్ ప్యాడ్ మీద తమకు ఇష్టం వచ్చింది రాసి.. ఫేక్ ప్రెస్ నోట్‌లు రెడీ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడం ద్వారా.. వైకాపా వాళ్లు ఇలాగే చిరు పేరిట ఫేక్ ప్రెస్ నోట్ తయారు చేసి వదిలారని అంటున్నారు.

కొందరేమో దీనిపై నాగబాబుతో మాట్లాడామని.. చిరు ప్రెస్ నోట్ ఫేక్ అని ఆయన కూడా ధ్రువీకరించారని.. దీనిపై ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడని ఒక ప్రచారం నడుస్తోంది. ఐతే చిరు ప్రెస్ నోట్ గురించి ఇప్పటికే అన్ని ప్రధాన వెబ్ సైట్లు, టీవీ ఛానెళ్లలో వార్తలు వచ్చేశాయి. ఆదివారం ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రధాన పత్రికలు సైతం దీనిపై ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో చిరు స్టేట్మెంట్ ఫేక్ అంటే నమ్మడం కష్టమే. మరి దీనిపై చిరు వైపు నుంచి ఏదైనా ఖండన వస్తే తప్ప ఆయన స్టేట్మెంట్ ఫేక్ అనుకోవడానికి లేదు.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English