జగన్ ఐడియా గంటా కు తెగ నచ్చేసింది

జగన్ ఐడియా గంటా కు తెగ నచ్చేసింది

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబ నాయుడుకు పార్టీ నేత‌ల నుంచి ఎదుర‌య్యే అసంతృప్తి ప‌రంప‌ర‌లో ఉత్త‌రాంధ్ర నేత గంటా శ్రీ‌నివాస‌రావు బోణీ చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌  శాసనసభలో మాట్లాడుతూ...విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌లో భాగంగా ఈ నిర్ణ‌యం ఉంటుంద‌ని జ‌గ‌న్ తెలిపారు.

అయితే, దీనిపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ నిర్ణ‌యం తుగ్ల‌క్ చ‌ర్య అని ఆరోపించారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం సీఎం జ‌గ‌న్ ప్రకటనను స్వాగతిస్తున్నానని తన అధికార ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు.

విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్‌ క్యాపిటల్‌), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేసేందుకు వీలుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేసి ఇలా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గంటా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదన్నారు. సముద్ర తీర ప్రాంతమైన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణాతో అనుసంధానమైన విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా మారితే.. విశ్వనగరంగా, రాష్ట్ర ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే సిటీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని గంటా త‌న వైఖ‌రిని వెల్ల‌డించారు.

అయితే, ఇప్ప‌టికే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌పై  ప్రతిపక్ష నేత చంద్ర‌బాబు విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. జధానిని ఎవరైనా మూడు ప్రాంతాల్లో పెడతారా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం అమరావతిలో ఉంటారా, విశాఖలో ఉంటారా, ఇడుపులపాయలో ఉంటారా అని  ప్రశ్నించారు. ఇలా పార్టీ అధినేత ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన త‌రుణంలో గంటా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌కు తెర‌లేపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English