అరుపులు తట్టుకోలేక ‘నేనూ కాపునే’ అన్న విజయసాయిరెడ్డి

అరుపులు తట్టుకోలేక ‘నేనూ కాపునే’ అన్న విజయసాయిరెడ్డి

తరచుగా వివాదాస్పద, ఆశ్చర్యకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లలో 90 శాతం మంది వైకాపా వాళ్లే ఉన్నారంటూ ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన కాపు కులస్థులు చేసుకుంటున్న ఓ కార్యక్రమానికి వెళ్లి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా కంబాలకొండలో జరిగిన ‘కాపుల ఆత్మీయ కలయిక’ కార్యక్రమానికి వెళ్లి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.

కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని జగన్ ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమంలో విజయసాయి మాట్లాడుతుండగా.. పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు వినిపించాయి. జై కాపు.. జైజై కాపు అంటూ కూడా పెద్ద ఎత్తున అరిచారు. దీంతో కార్యక్రమంలో అలజడి నెలకొంది.

కాపుల సమావేశానికి వైకాపా నేతలందరినీ ఎందుకు తీసుకొస్తారంటూ సభికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి విజయసాయికి తలెత్తింది. దీంతో ‘నేను కూడా కాపునే. మీలో ఒకడినే. చనిపోయే ముందు నా డెత్ సర్టిఫికెట్ మీద కాపు అనే ఉంటుంది’ అంటూ అక్కడి వాళ్లను కూల్ చేసే ప్రయత్నం చేశారు. రాయలసీమలో రెడ్లకు సంబంధించిన ఏ సర్టిఫికెట్లో అయినా కులం దగ్గర ‘కాపు’ అనే ఉంటుంది.

కానీ వారిని ఆంధ్రా కాపులు తమ వారుగా చూడరు. అందుకేనేమో విజయసాయి వ్యాఖ్యలు ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత కూడా అలజడి కొనసాగింది. తాను మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి సహనంగా ఉన్నానంటూ అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు రాగా ఈ కార్యక్రమంలో దాని గురించి మాట్లాడటం సరికాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English