వైసీపీలో రాజ్యసభ రేస్.. ఆ నలుగురికీ చాన్స్

వైసీపీలో రాజ్యసభ రేస్.. ఆ నలుగురికీ చాన్స్

వైసీపీలో సీనియర్ నేతలు కీలక పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఏడాది  ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతుండడంతో ఆ స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ నాలుగు స్థానాలు వైసీపీకి దక్కుతాయన్నది సుస్పష్టం. దీంతో రాజ్యసభ సభ్యత్వాల కోసం వైసీపీ నేతల నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కొందరు ఈ సీట్లకు గురిపెట్టినట్లు టాక్.

ఇందుకోసం కొందరు నేతలు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ నాలుగు స్థానాలకుగానూ ముగ్గురు అభ్యర్థులను వైసీపీ ఇప్పటికే ఖరారు చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు, గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక రాంకీ గ్రూప్ అధినేత అయోధ్యరామిరెడ్డికి కూడా జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారని సమాచారం. మిగిలిన ఒక సీటును ఎస్సీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

సిట్టింగ్ ఎంపీ సీటు ఒంగోలును వదులుకున్నప్పుడు వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారనే చెబుతున్నారు. అయితే ఇప్పటికే వైవీకి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన జగన్... ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

వైసీపీకి ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఉండగా, వాళ్లిద్దరూ రెడ్డి సామాజికవర్గమే. దాంతో, వచ్చే ఏడాది వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని రెడ్డి కమ్యూనిటీ ఇచ్చే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఆ లెక్కన సుబ్బారెడ్డికి దక్కకపోవచ్చంటున్నారు. మొత్తానికి వైసీపీలో పదవులు ఎవరికి దక్కినా పార్టీకి మాత్రం పెద్దల సభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఏకంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులుంటారు ఆ పార్టీకి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English