ఏపీ రాజ‌ధానిపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఏపీ రాజ‌ధానిపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుందా లేదా అనే విష‌యంలో గ‌త కొన్ని నెల‌లుగా ఎంత సందిగ్ధ‌త న‌డుస్తోందో తెలిసిందే. రాజ‌ధాని విష‌య‌మై మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌తో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. రాజ‌ధానిని మార్చేస్తార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రిగింది. అంత‌కంత‌కూ ఈ సందిగ్ధ‌త కొన‌సాగుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య‌ స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇంత‌కుముందు రాజ‌ధాని మార్పు ఉండ‌ద‌న్న సంకేతాలు ఇచ్చిన ఏపీ స‌ర్కారు.. ఇప్పుడు లిఖిత పూర్వ‌కంగా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ఇంత‌కుముందు రాజధాని మార్పుపై అస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న‌ల‌తో గంద‌ర‌గోళానికి గురి చేసిన‌ మంత్రి బొత్స సత్యనారాయణే ఇప్పుడు ఈ విష‌య‌మై స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఏపీ రాజధాని అమరావతిని మార్చడం లేదంటూ లిఖితపూర్వకంగా బొత్స సమాధానం ఇచ్చారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీ అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని మండలిలో ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెల‌ల కింద‌ట భార‌త ప‌టంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని లేన‌ట్లుగా పేర్కొన్న ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ ఆ త‌ర్వాత త‌ప్పును దిద్దుకున్న సంగ‌తి తెలిసిందే.

అమరావతిని గుర్తిస్తూ ఆ సంస్థ‌ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే రాజధానిపై  ఏపీప్రభుత్వం ఇటీవ‌లే ఓ నిపుణుల కమిటీని నియమించింది. రాజ‌ధానిని కొన‌సాగించాలా మార్చాలా అనే విష‌యంలో ఆ క‌మిటీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేక‌రించింది. ఆ క‌మిటీ నివేదిక ఆధారంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న బొత్స‌.. ఈ లోపే రాజ‌ధాని మార్చ‌ట్లేదంటూ స‌మాధానం ఇవ్వ‌డం విశేష‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English