జగన్ కంటే విజయసాయిరెడ్డి టెన్షన్ ఎక్కువైపోతోందట..

 జగన్ కంటే విజయసాయిరెడ్డి టెన్షన్ ఎక్కువైపోతోందట..

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఆ పార్టీని ఇరకాటంలో పెడుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో నేరుగా టచ్‌లోకి వెళ్తుండడంతో జగన్ ఇప్పటికే ఆయన్ను పిలిచి మాట్లాడడమూ జరిగింది. అయినా, ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గినట్లుగా లేదు. తాజాగా ఆయన మరోసారి దిల్లీలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు పెట్టినా తన వైఖరి మారదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తానని రఘురామకృష్ణారెడ్డి మరోసారి సంకేతాలు పంపారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీని, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాను రఘురామకృష్ణంరాజు కలవడం వైసీపీలో కలకలానికి దారి తీసింది. ఇక, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు భారీ విందే ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. సబార్డినేట్ లేజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు ఇచ్చినప్పటికీ... ఇది కూడా వైసీపీ కలవరం పుట్టిస్తోంది. ఈ విందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు, వీవీఐపీలను ఆహ్వానించినా... కేంద్ర మంత్రుల్లో రాజ్ నాథ్ సింగ్ మాత్రమే హాజరయ్యారు. దీనికి వైసీపీ నుంచి మిథున్ రెడ్డి వెళ్లారు. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు... టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్రావు అటెండ్ అయ్యారు.

అయితే, కేంద్ర మంత్రులకు, ఎంపీలకు  రఘురామకృష్ణంరాజు ఇచ్చిన విందుపై వైసీపీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అనుమతి లేకుండా మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను రఘురామకృష్ణంరాజు కలవడంపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో... ఈ విందుపై ఎలా స్పందిస్తారోనన్నది చర్చనీయాంశమైంది. అయితే, కేంద్ర పెద్దలను బుట్టలో వేసుకునేందుకు, అలాగే బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకే రఘురామకృష్ణంరాజు ఈ భారీ విందును ఇచ్చారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదంతా ఒకెత్తయితే రఘురామకృష్ణంరాజు వైఖరితో జగన్ కంటే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్కువగా టెన్షన్ పడుతున్నారట. అందుకు కారణం.. దిల్లీలో ఇంతవరకు వైసీపీ తరఫున పెద్ద తలకాయ విజయసాయిరెడ్డే. బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్న నేతగా ఎస్టాబ్లిస్ అయిందీ ఆయనే. కానీ, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఆయన్ను మించిన వేగంతో దూసుకుపోతుండడంతో సాయిరెడ్డి కంగారుపడుతున్నారట. తన డామినేషన్‌కు ఎక్కడ దెబ్బ పడుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారట.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English