అక్కడ విలీనానికి నో- ఇక్కడ పార్టీకి ఎస్

అక్కడ విలీనానికి నో- ఇక్కడ పార్టీకి ఎస్

తెలుగునాట రెండు రాజకీయ పరిణామలు ఇప్పుడు చర్చల్లో వున్నాయి. ఒకటి టీఆర్ఎస్-కాంగ్రెస్ విలీనం. రెండవది కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ. చిత్రమేమిటంటే ఇందలో మొదటి దాంతో ఎంత ప్రయోజనం లేదో, రెండో దాంతో కూడా అంతకన్నా ప్రయోజనం లేదు, కానీ ఇంకో చిత్రమైన సంగతి ఏమిటంటే, మొదటి విషయం తెలిసి కేసిఆర్ జాగ్రత్త పడుతున్నారు. రెండో విషయం తెలిసీ కిరణ్ ముందుకు ఉరుకుతున్నారు. ఈ వైనాలు కాస్త చూద్దాం..

కాంగ్రెస్ కు కావాల్సింది టీఆర్ఎస్ విలీనం. దాని వల్ల బహుళ ప్రయోజనాలు వున్నాయి. ఒకటి తెలంగాణలో కొరకరాని కొయ్య మాదిరిగా తయారైన కెసిఆర్ ను తన పార్టీలో కట్టేసుకోవచ్చు. తెలంగాణలో అధికారం చెలాయించవచ్చు. మారు మాటాడితే చిరంజీవి మాదిరిగా కెసిఆర్ ను కట్టడి చేయచ్చు. కానీ కెసిఆర్ మాత్రం చిరంజీవి కాదు. నాలుగాకులు ఎక్కువే చదివిన వాడు. కాంగ్రెస్ వ్వవహారాలు తెలియని వాడు కాదు. పైగా ఇన్నేళ్ల పోరాట ఫలాన్ని తను తన కుటుంబ సభ్యులు అనుభవించాలంటే, అధికారం పూర్తిగా తన చేతిలో వుండాలన్న సంగతి బాగా తెలిసిన వాడు. అందుకే వినయంగా వుంటూనే, విలీనాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఆ నెపాన్ని కార్యకర్తలపై తోస్తున్నాడు. నిజానికి టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన చాలా మంది మేధావులు, గతంలో స్వాతంత్ర్యోద్యమం తరువాత గాంధీ కాంగ్రెస్ ను రద్దు చేయమన్నట్లే టీఆర్ఎస్ రాజకీయాల నుంచి తప్పుకోవాలనే భావిస్తున్నారు. ఇదంతా లోపాయి కారీ వ్యవహారం. కానీ కెసిఆర్ అలా భావించడం లేదు. అయితే ఇప్పుడీ వేడిలో ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. మంద కృష్ణ మాదిగో, యర్రబిల్లి దయాకరరావో తప్పించి. వారు మాత్రమే కెసిఆర్ నిన్నటి మాటలు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు. అయితే ఒపీనియన్స్ చేంజ్ చేయకపోతే వాడు రాజకీయనాయకుడే కాదన్నాడు గిరీశం. అందుకే కెసిఆర్ చాలా చాకచక్యంగా తన మాటలు అన్నీ మరిచిపోయి, అధికారం దిశగా సాగిపోతున్నాడు.

ఇక కిరణ్ కుమార్ రెడ్డిది రివర్స్ గేర్ వ్వవహారం. కాంగ్రెస్ ను బుజ్జగిస్తూనే తన గేమ్ తాను ఆడేసాడు. ఆట అయిపోయి, క్రీజులోకి వచ్చి పడ్డాక, తానే కొత్త ఆట ప్రారంభిద్దామని, ఆటగాళ్ల కోసం వెదుకుతున్నాడు. అయితే ఇప్పటికే బరిలో వున్న ప్రత్యర్థి జట్లు బలమైనవని తెలిసి, ఆయన టీమ్ లోకి రావడానికి ప్లేయర్లు జంకుతున్నారు. దీంతో గేమ్ ఎలా మొదలెట్టాలో తెలియక ఆయన కిందా మీదా పడుతున్నారు. కిరణ్ మంచి ప్లేయర్ అయితే అయి వుండొచ్చు కానీ, టీమ్ పెట్టేంత కెప్టెన్ మాత్రం కాదు. కానీ ఆ సంగతి ఆయన గ్రహిచడం లేదు. తన ఆట తనను ఆడనివ్వలేదన్న కసిలో వున్నారు. అందుకే ఎలాగైనా తన టీమ్ తాను ప్రారంభిచేసి తన ఆట తాను ఆడేయాలనుకుంటున్నారు. అయితే దీని వెనుక ఓ చిన్న స్ట్రాటజీ వుందని వినికిడి. చిరంజీవి మాదిరిగా కనీసం ఓ డజను స్థానాలైనా గెల్చుకుని, ఆపై కాంగ్రెస్ లో విలీనమై, తన పూర్వ వైభవం అంత కాకున్నా, కనీసం గౌరవ ప్రదమైన స్తానం పొందాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. కానీ జనం అంత అవకాశం ఇస్తారా అన్నదే అనుమానం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English