వైసీపీలోకి బాలకృష్ణ ఆప్త మిత్రుడు?

 వైసీపీలోకి బాలకృష్ణ ఆప్త మిత్రుడు?

టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత ఆప్తుడైన కదిరి బాబూరావు వైసీపీలోకి వెళ్లనున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూ రావు 2004 లో టిడిపిలో చేరి నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో టిడిపి అభ్యర్థిగా సీటు సాధించారు. ఆ ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కదిరి బాబూరావు.

అనంతరం 2009 లో సొంత నియోజకవర్గమైన కనిగిరికి మారారు. కానీ.. నామినేషన్ల సమయంలో ఎన్నికల అఫిడవిట్ లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో డిస్ క్వాలిఫై అయ్యారు. 2014 లో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు.  2019 లో కనిగిరి నుంచి మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నో చెప్పడంతో దర్శి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికలలో టిడిపి ఘోరపరాజయం పాలైంది.. బాబూరావు కూడా ఓటమి పాలయ్యారు.

కాగా కనిగిరి కాకుండా దర్శి నుంచి పోటీ చేయించడం వల్లే ఓడిపోయానని ఆయన చంద్రబాబుపై కాస్త గుర్రుగానే ఉన్నారు. సొంత నియోజకవర్గం కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఉండడంతో తనకు అక్కడ ఇక అవకాశం దక్కదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

బీజేపీ గానీ ఇటు వైసీపీలోకి గాని వెళ్లాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా తాడేపల్లిగూడెంలో తన సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు భేటీ కావడంతో అక్కడికి వెళ్లిన ఆయనా అక్కడా తనకు సరైన మార్గదర్వకత్వం దొరక్కపోవడంతో డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా పార్టీకి సమాచారం ఇవ్వకుండా తాడేపల్లిగూడెంలో కాపు నాయకులతో భేటీ కావడంతో పార్టీ మార్పుపై చర్చ జరుగుతోంది. ఆయన మీద గుర్రుగా ఉన్న టిడిపి మరోసారి దర్శి బాధ్యతలనూ చూసుకునే బాధ్యతను అనధికారికంగా శిద్ధా రాఘవరావుకూ అప్పగించారు. శిద్దా రాఘవరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో తన స్థానానికి ఎసరొచ్చేలా ఉందని కదిరి బాబురావు ఆందోళనలో పడ్డారు. నియోజక వర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో తానే ఇన్చార్జినని శిద్దా కాదని చెప్పుకుంటున్నారు. ఇక పై తాను చెప్పినట్లే కార్యకర్తలు నడవాలని తెలుగు తమ్ముళ్లకు హుకుం కూడా జారీ చేశారు. దీంతో ఇప్పుడు దర్శిలో శిద్దా కదిరిల మధ్య వార్ మొదలైందని తమ్ముళ్లు అనుకుంటున్నారు.

దీంతో ఆయన వైసీపీ లేదా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లగా సమాచారం.  మామూలుగా అయితే టీడీపీలో తనకు సీటు ఇచ్చే విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాదన్నా బాలయ్య దగ్గర చక్రం తిప్పి తాను తలుచుకున్న చోట సీటును సాధించడంలో కదిరి బాబు నేర్పరి కావడంతో టిడిపిలో ఇంతకాలం ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటు కనిగిరి, అటు దర్శిలోనూ ఆయన స్థానానికి ఎసరొచ్చే సూచనలుండడంతో ఈసారి తన దారి తాను చూసుకోవడం బెటరని ఆయన భావిస్తున్నారని అనుచరులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English