బీజేపీలో చేరనున్న ఆనం రామనారాయణరెడ్డి?

బీజేపీలో చేరనున్న ఆనం రామనారాయణరెడ్డి?

మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ సమీకరణలతో పాటు సొంతపార్టీ నేతలపై ఆనం చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలో ఇమడలేకపోతున్న ఆనంకు బీజేపీ నుంచి కూడా ఆ దిశగా మంచి ఆఫర్‌ వచ్చినట్లు నెల్లూరు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. బీజేపీలో చేరితే ఆనంకు రాష్ట్రస్థాయిలో కీలకమైన పగ్గాలు ఇవ్వాలని కూడా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

రాజశేఖర్‌ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన శాఖలు నిర్వహించిన ఆనం, ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో కూడా కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న దశాబ్ధ కాలంలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన ఆనంకు ఒకానొక సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టాలని యోచించడంతో పాటు ఆ దిశగా ఆయన పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే విభజన అనంతరం కాంగ్రెస్‌ కనుమరుగు కావడం, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు అనుకూలించక ఆనం టిడిపిలో చేరారు.

ఆత్మకూరు నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించే టైమ్‌లోనే స్థానికంగా ఉన్న నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తనకు ఇవ్వడం లేదని కోపంతో ఆనం టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ ఆయనకు వెంకటగిరి టికెట్‌ను ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన ఆనంకు మంత్రి పదవి ఇస్తారని అంతా ఆశించారు. కానీ, నెల్లూరు నుంచి కొత్త తరానికి చెందిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పోలుబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు జగన్ తన కేబినెట్‌లో స్థానం ఇచ్చారు.

అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్న ఆనంకు ఇటీవల నెల్లూరు నగరంలో చోటు చేసుకుంటున్న తాజా సంఘటనలు పుండు మీద కారం జల్లినట్లు అయ్యాయి. దశాబ్ధాల కాలంగా వారి ఆధీనంలో ఉన్న నెల్లూరు వీఆర్‌సీ విద్యాసంస్థలు, వేణుగోపాల స్వామి డిగ్రీ కాలేజ్‌, వేణుగోపాల స్వామి ఆలయాలకు సంబంధించిన భూముల వ్యవహారంపై జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇటీవల దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రికార్డులు బయటకి తీయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీఆర్‌సీ విద్యాసంస్థల సెక్రటరీ బాధ్యతల నుంచి ఆనం కుటుంబీకులను తొలగించి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఇన్‌చార్జి పగ్గాలు కట్టబెట్టారు. ఈ సంఘటనలన్ని ఆనం జీర్ణించుకోలేకపోతున్నారు.

అధికార పార్టీలో ఉండి కూడా తమ ఆధీనంలో ఉన్న వాటిపై సొంత పార్టీ నేతలే విచారణకు ప్రయత్నం చేయడం ఆయన మరింత ఆవేదనకు గురైనట్లు చెబుతున్నారు. ఇదే విషయంపైనే ఆయన గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ నాలుగు రోజుల క్రితమే ఎస్పీ బదిలీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

వైసీపీలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనంకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన, నాయకులతో పరిచయాలున్నాయి. వేర్వేరు పార్టీలకు చెందినప్పటికీ ఒకే జిల్లాకు చెందినవారు కావడంతో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉండి ప్రస్తుతం బీజేపీ గూటికి చేరిన పలువురు సీనియర్‌ నేతలతో నేటికి సత్సంబంధాలు ఉన్నాయి. వారందరికి పిలుపు మేరకే ఇష్టంలేని వైసీపీలో కష్టంగా కొనసాగడం కంటే తనకు తగిన ప్రాధాన్యతనిచ్చే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడమే ఉత్తమమన్న ఆలోచనకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఆనం బీజేపీలో చేరితే రాష్ట్రస్థాయిలో కీలకమైన పగ్గాలను ఆ పార్టీ అప్పగించేందుకు సిద్ధంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలను కాకుండా ఇలా హఠాత్తుగా పగ్గాలు అప్పగించే పని బీజేపీ చేస్తుందా అన్న అనుమానాలూ ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English