జగన్ పరిస్థితి ఏమిటి?

జగన్ పరిస్థితి ఏమిటి?

రాష్ట్రం విడిపోతుందా, సమైక్యంగా ఉంటుందా అన్నది తేలిపోయింది. ఈ విషయం అటో ఇటో తేలితే కాని సీమాంద్రలో కాంగ్రెస్, టిడిపిల్లో వలసలు ఉండవన్న భావం ఇన్నాళ్లు అందరిలో ఉంది. ఇక ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ ఖాలీ అవుతుంది, సమైక్యం అంటూ రాగం అందుకున్న జగన్ పార్టలోకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు టిడిపి బాగోతం కూడా బయటపడి అందులో నుంచి కూడా ప్రముఖ నేతలు జగన్ పార్టీలోకి చేరుతారు అంటూ వైకాపా నేతలే మైకు దొరికినప్పుడల్లా చెప్పారు.

కాని ఇప్పుడు పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జగన్ పార్టీలోకి ఎవరు చేరలేదు సరికదా, ఖాలీ అవుతుంది అని భావించిన టిడిపి నిండి పోతోంది. ఇక నిండిపోతుంది అనుకుంటున్న జగన్ పార్టీ లోకి వెళ్లే వారి జాడ మాత్రం కనిపించడంలేదు. దీంతో జగన్ పరిస్థితి ఏమిటి అన్న అనుమానం కలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. మంత్రులు చాలా మంది తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. రాష్ట్ర విభజన అంశం తేలగానే వారు వచ్చేస్తారు అని జగనే ఓ సంధర్భంలో ప్రకటించారు.

అలాంటిది ఇప్పుడు పరిస్తితి భిన్నంగా కనిపిస్తోంది. తాజగా కాంగ్రెస్ వీడుతున్నామని ప్రకటించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్ లు ఈ నెల 27న టిడిపిలో చేరుతున్నట్లు వార్తలు వెలుబడ్డాయి. కాని ఇంత వరకు ఏ మంత్రి కాదు కదా,కనీసం ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జగన్ వైపు చూడడం లేదు. పైగా తాడిపత్రిలో చంద్రబాబు సభ ఏర్పాటు చేయబోతున్నారు. జగన్ పాట పాడిన మాజి మంత్రి జేసి దివాకర్ రెడ్డి ఈ సంధర్బంగా చంద్రబాబు పంచన చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తీరా ఎన్నికల ముందుకు పోతున్న వేళ, సీమాంద్రలో టిడిపి పతనం అయిందని భావిస్తున్న వేళ మంత్రుల వంటి పెద్దలే ఆ పార్టీ బాట పట్టి, జగన్ వైపుకు పోవడం లేదేంటి అంటే సీమాంద్రలో దాని బలం పెరిగి ఉండాలి, లేదా జగన్ బలం తగ్గి వుండాలి, ఇదీ కాకపోతే జగన్ అంటే నచ్చకపోవడమైనా అయ్యుండాలి అన్న సందేహాలు కలగడం సర్వసాధారణం. అయితే ఈ మద్యకాలంలో జగన్ పార్టీని వీడిన ఆ పార్టీ ప్రముఖ నాయకులు ప్రధానంగా ఆరోపణలు గుప్పించింది ఆయన స్వభావం పైనే.

జగన్ అహంబావి అని, అహంకారం ఎక్కువ అని ఆరోపించారు. పార్టీలో ఏ లీడరు ఎదగడాన్ని ఆయన జీర్ణించుకోలేడని, తన వద్ద తన కంటే పాపులర్ గా ఎవరు కనిపించకూడదని భావిస్తారని కూడా జగన్ పై అభియోగాలున్నాయి. అంతే కాదు ఆయనదంతా నియంతృత్వ దోరణి అని కూడా అంటున్నారు. అందుకే చాలా మంది సీనియర్లు ఆత్మాభిమానం చంపుకోలేకనే జగన్ వద్దకు పోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల వెల్లడైన సర్వేలు కూడా సీమాంద్రలో జగన్ పార్టీకి తిరుగులేదని చెప్పాక కూడా టిడిపిలోకి వెళుతూ, జగన్ వైపుకు రావడం లేదంటే ఇదే నిజమనే భావానికి కూడా బలం చేకూరుతోంది అంటున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English