ఏపీలో ప్రాణం తీసిన ఉల్లిపాయ

ఏపీలో ప్రాణం తీసిన ఉల్లిపాయ

ఏపీలో ఉల్లిపాయలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించి ధరలు నియంత్రణ చేయడానికి బదులు తక్కువ ధరకు రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో పేద ప్రజలు రైతు బజారుల్లో అమ్మే ఉల్లి కోసం బారులు తీరుతూ నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాటలూ జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో సాంబయ్య అనే వృద్ధుడు ఈ రోజు ఉదయం నుంచి ఉల్లిపాయల కోసం క్యూలో నిల్చుని కాసేపటి కిందట మరణించాడు. లైన్లో నించుని ఉన్న ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

రైతు బజారును ఉదయం 7 గంటలకే తెరిచారు. అయితే, అంతకు చాలా ముందు నుంచే జనం లైన్లలో నుంచున్నారు. ఈ క్రమంలోనే తిండీనీరు లేకుండా గంటలకొద్దీ లైన్లో నుంచోవడంతో సాంబయ్య స్పృహ తప్పి పడిపోయాడు. మరిన్ని విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పరిమిత సంఖ్యలోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

మరోవైపు ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. విశాఖపట్నంలోనూ ప్రజలు రైతు బజార్ల వద్ద బారులు తీరి నుంచున్నారు. రాయలసీమలో అనంతపురం, కడప జిల్లాల్లోనూ ఇదే పరస్థితి కనిపించింది. విశాఖలోనూ చిన్నపాటి తొక్కిసలాటలు జరిగాయి. రైతు బజార్ల వద్ద కిలోమీటర్ల దూరం క్యూలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English