‘సాక్షి’ని ఉతికారేస్తున్న నెటిజన్లు

‘సాక్షి’ని ఉతికారేస్తున్న నెటిజన్లు

సాక్షి పత్రిక ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆ పత్రిక ద్వంద్వ ప్రమాణాల్ని బయటపెడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఉతికారేసేస్తున్నారు. తాజాగా ‘సాక్షి’ పత్రిక మరోసారి సోషల్ మీడియా సైనికులకు దొరికిపోయింది. ఆ పత్రిక ఆదివారం నాటి తన సంచికలో పత్రిక ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా ఆదివారం ‘సాక్షి’ పత్రికను ఆరు రూపాయలకు అమ్ముతుండగా.. ఈ రోజు నుంచి 7 రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

ఐతే న్యూస్ ప్రింట్ ధర అంతకంతకూ పెరుగుతూ పత్రికను నడపడం పెద్ద భారంగా మారుతున్న నేపథ్యంలో ధరలు పెంచడం.. అది కూడా ఒక్క రూపాయే కావడం అన్యాయం ఏమీ కాదు. ‘సాక్షి’ ధర పెంపు కూడా అర్థం చేసుకోదగ్గదే. కానీ ఒకప్పుడు తెలుగు పత్రికల ధరల విషయంలో ‘సాక్షి’ చేసిన హడావుడే ఇప్పుడు దానిపై విమర్శలకు కారణం. తెలుగు పత్రికలు 3-3.5 రూపాయల మధ్య ధరతో అమ్ముతున్నపుడు ‘సాక్షి’ని రూ.2 ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. పైగా మిగతా పత్రికల్లా కాక అన్ని పేజీలూ కలర్లో ఇచ్చారు.

ఐతే ధర తగ్గించి ఇవ్వడం సాక్షి ఇష్టం. కానీ మిగతా పత్రికలు కూడా రూ.2కే పత్రిక ఇవ్వాలంటూ అప్పట్లో ఉద్యమం చేపట్టింది సాక్షి. కొన్ని రోజుల పాటు ఈ డిమాండ్‌తో పత్రికలోనే క్యాంపైన్ నడిపింది. ఐతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. క్విడ్ ప్రో కోలో భాగంగా ‘సాక్షి’లోకి పెట్టుబడులు వచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీని మీద కోర్టులో కేసులు నడవడం కూడా తెలిసిందే. ఆ సంగతలా వదిలేస్తే.. అప్పుడు రూ.2కే మిగతా పత్రికలూ ఇవ్వాలని ఉద్యమం నడిపిన సాక్షి తర్వాతి పరిణామాలతో ధర పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు ఆదివారం నాటి ఆ పత్రిక ధర రూ.7కు చేరుకుంది. ఇలా స్టాండ్ మార్చుకుంటూ వెళ్లడంతో ఒకప్పటి ఆ పత్రిక ప్రచారాన్ని, హడావుడిని గుర్తు చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English