హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై ఐపీఎస్ అధికారి కౌంటర్

హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై ఐపీఎస్ అధికారి కౌంటర్

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ నిన్నట్నుంచి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఎన్‌కౌంటర్ పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పోలీసులు నేషనల్ లెవెల్లో హీరోలు అయిపోయారు. నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడం, తమపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసమే వాళ్లను చంపినట్లు పోలీసులు చెబుతన్నారు.

కానీ పోలీసుల ఉద్దేశం వేరని జనాలు బలంగా నమ్ముతున్నారు. దిశకు జరిగిన అన్యాయంపై రగిలిపోతున్న జనాల్ని శాంతింపజేయడానికి.. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించడానికి పోలీసులు నిందితుల కథను ఇలా ముగించారని అందరూ భావిస్తున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ఎవ్వరూ చెప్పకపోయినా.. జనాలు నమ్ముతున్నది అదే. కంటికి కన్ను.. ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా దిశను రేప్ చేసి కాల్చి చంపేసిన నిందితులకు ఇలా శిక్ష విధించడమే కరెక్ట్ అని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో సమస్యకు ఇదే సరైన పరిష్కారమా అన్న చర్చా జరుగుతోంది. చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదని.. ఇలా చేసినంత మాత్రాన న్యాయం జరిగినట్లు కాదని.. దీని వల్ల దుష్పరిణామాలూ ఉంటాయని అభిప్రాయపడుతున్న వాళ్లూ ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ ఇలాంటి స్వరాలు పెరుగతాయి. మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగాక ఏం జరుగుతుందో చూడాలి.

ఈ లోపు ఒక పోలీసు అధికారే తెలంగాణ పోలీసుల తీరును తప్పుబడుతూ ట్వీట్ వేసే సాహసం చేయడం గమనార్హం. ఆయన ఒక ఐపీఎస్ అధికారి కావడం విశేషం. హరియాణాలో ఎస్పీగా పని చేస్తున్న పంకజ్ నైన్.. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ మీద ఒక సంచలన ట్వీట్ వేశారు. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్లే అని.. అలాగే న్యాయం చేయడానికి మరీ ఆత్ర పడితే.. న్యాయాన్ని మరుగున పడేసినట్లు అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాత ఎన్‌కౌంటర్ చేయబడ్డ నిందితులకు సంబంధించిన వీడియోల్ని ఆయన షేర్ చేశారు. వాటి మీద ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.  ఇలాంటి కేసుల్లో ఆవేశం పనికిరాదని.. ఎన్‌కౌంటర్లు సరికాదని ఆయన పరోక్షంగా అంటున్నట్లే ఉంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English