కోహ్లీని కవ్విస్తారా.. ఇంకోసారి ఆలోచించుకోండి

కోహ్లీని కవ్విస్తారా.. ఇంకోసారి ఆలోచించుకోండి

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి అంత టెంపర్ ఉన్న క్రికెటర్ మరొకరు కనిపించరు. మామూలుగా కెరీర్ ఆరంభంలో, ఉడుకు రక్తంతో ఉన్నపుడు క్రికెటర్లు చాలా ఆవేశంగా కనిపిస్తారు. కానీ అనుభవం, స్థాయి పెరిగే కొద్దీ ఆవేశం తగ్గించుకుంటారు. కామ్‌గా తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ కోహ్లి ఇందుకు భిన్నం.

30 ప్లస్‌లోకి వచ్చినా కూడా అతడిలో ఉత్సాహం, ఆవేశం ఎంతమాత్రం చల్లారలేదు. మైదానంలో దూకుడుకు మారుపేరుగా కనిపించే కోహ్లి.. తనను నడిపించేది ఆవేశమే అని భావిస్తాడు. వికెట్ పడితే అతను సంబరాలు చేసుకునే తీరు.. ఒక షాట్ కొట్టినా, సెంచరీ బాదినా ఎగ్జైట్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది. ఇక కోహ్లిని అవతలి జట్టులోని బౌలర్లు కవ్వించారా అంతే సంగతి. అతడిలో కసి రెట్టింపవుతుంది. ఇక అతణ్ని ఆపడం కష్టమవుతుంది.

అందుకే ఏదైనా సిరీస్ మొదలయ్యే ముందు కోహ్లిని రెచ్చగొట్టొద్దని ప్రత్యర్థి జట్ల మాజీలు తమ బౌలర్లను హెచ్చరిస్తుంటారు. పొరబాటున కోహ్లిని కవ్విస్తే ఎలా ఉంటుందో.. ఎన్నాళ్లయినా దాన్ని మరిచిపోకుండా ఎలా మనసులో పెట్టుకుని జవాబిచ్చే ప్రయత్నం చేస్తాడో శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రుజువైంది.

ఈ మ్యాచ్‌లో విండీస్ ఫాస్ట్ బౌలర్ విలియమ్స్ బౌలింగ్‌ను విరాట్ ఉతికారేశాడు. కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత విరాట్ ఒక విచిత్రమైన సంజ్ఞ చేశాడు. బ్యాటును నోట్ బుక్‌లాగా వాడుకుంటూ టిక్ కొట్టినట్లు చూపించి విలయమ్స్‌కు కౌంటర్ ఇచ్చాడు. దీని వెనుక ఒక కథ ఉంది.

వికెట్ తీసినపుడు బ్యాట్స్‌మన్‌ను ఎద్దేవా చేస్తూ జేబులోంచి నోట్ బుక్ తీసి టిక్ కొట్టినట్లు చేయడం విలియమ్స్ స్టైల్. ఎప్పుడో 2017లో కోహ్లిని ఔట్ చేసి విలియమ్స్ ఇలాగే సంజ్ఞ చేశాడట. దాన్ని అలాగే మనసులో పెట్టుకుని ఇప్పుడు విలియమ్స్‌ను టార్గెట్ చేసుకుని అదే రకమైన సిగ్నల్‌తో అతడికి జవాబు చెప్పాడు కోహ్లి. ఇది చూశాక కోహ్లిని ఇంకోసారి కవ్వించడానికి ఏ బౌలర్ అయినా భయపడతాడనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English