హిజాబ్ కాదు బికినీ అయినా ఓకే.. ప్రియాంకా గాంధీ కామెంట్స్

క‌ర్నాట‌కలో హిజాబ్ వివాదం అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ వస్త్రాధార‌ణ‌పై అనుకూల వ్య‌తిరేక కామెంట్ల‌తో స్థానిక నేత‌లు మొద‌లుకొని జాతీయ నాయ‌కుల వ‌ర‌కు త‌మ వైఖరిని వినిపిస్తుండ‌గా తాజాగా కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ ఈ జాబితాలో చేరుతూ సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

క్లాస్‌రూంల్లో హిజాబ్ ధ‌రించ‌డంపై క‌ర్నాట‌క‌లో నిషేధం విధించ‌గా విద్యార్ధినుల‌కు మ‌ద్ద‌తుగా ప్రియాంక ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఆమె పేర్కొన్న అంశాలు కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాయి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఎలాంటి దుస్తులు ధ‌రించాలన్న‌ది విద్యార్ధినుల ఎంపిక‌ని, రాజ్యాంగం వారికి ఆ హ‌క్కును ప్ర‌సాదించింద‌ని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.

బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధ‌రించాల‌నేదని మ‌హిళ‌ల ఇష్ట‌మ‌ని, ఇది వారికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్‌కు మ‌ద్ద‌తుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీతో స్పందించారు.

అయితే, ప్రియాంక ట్వీట్ ను మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హిజాబ్ అంశంలోకి బికినీ ఎందుకు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కాలేజీ విద్యార్థుల‌కు బికినీ వేసుకోవాల‌ని మీరు సూచ‌న చేస్తున్నారా? అంటూ కొంద‌రు నిల‌దీస్తున్నారు. అస‌లు బికినీ అంశం ఎందుకు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది? అంటూ ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రియాంక ఇరుకున ప‌డుతున్నార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.