మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలను బుక్ చేసిన కేసీఆర్

మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలను బుక్ చేసిన కేసీఆర్

ఏదైనా సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అంశం మీద మాట్లాడటానికి.. స్పందించటానికి ఏ మాత్రం ఇష్టపడరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇష్యూ ఏదైనా సరే.. బర్నింగ్ టాపిక్ గా ఉన్న అంశం మీద మాట్లాడటానికి ఆయన ససేమిరా అంటారు. అది ఖండన కావొచ్చు.. పరామర్శ కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు. తనకేమాత్రం పట్టనట్లుగా వ్యవహరించి.. వాతావరణం తనకు అనుకూలంగా మారిందన్న భావనకు వచ్చినంతనే చెలరేగిపోవటం కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

ఈ కారణంతోనే సమస్యల్ని ఫేస్ చేయటంలో కేసీఆర్ వెనుకబడి ఉంటారని.. సరైన సమయంలో సరైన రీతిలో రియాక్ట్ కావటంలో ఫెయిల్ అవుతారన్న పేరుంది. అయితే.. తన సంగతి ఎలా ఉన్నా.. దాన్ని పట్టించుకోకుండా ఇష్యూను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయన తరచూ సక్సెస్ అవుతూనే ఉంటారు.

తాజాగా జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెను చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. 52 రోజుల సుదీర్ఘ కాలం సమ్మె జరిగినా స్పందించని కేసీఆర్.. వారికి వారే భేషరుతుగా ఉద్యోగాల్లో చేరతామన్న తర్వాత.. కార్మిక నాయకుల్ని పక్కన పెట్టేసి తనతో కలిసి నడవాలన్న పిలుపునిచ్చారు కేసీఆర్.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన నివాసంలో ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి.. వారిని సంతోషానికి గురి చేసిన ఆయన విందు భోజనంతో కడుపు నిండిపోయేలా చేశారు. రిటర్న్ గిఫ్ట్ మాదిరి వరాల వర్షంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసి.. ప్రగతి భవన్ నుంచి సాగనంపారు. ఈ ఎఫెక్ట్ తో కేసీఆర్ కు వీరాభిమానులుగా ఆర్టీసీ కార్మికులు మారిపోతారనటంలో సందేహం లేదు. అంతేనా.. ఆర్టీసీని లాభాల్లో తీసుకొస్తే తాను ఇచ్చే బోనస్ లెక్కలు చెప్పి ఊరించారు.

మహిళా కార్మికుల విషయంలో ఆయన ప్రకటించిన వరాలు.. రానున్న రోజుల్లో కేసీఆర్ కు వీర విధేయులుగా ఉండిపోతారనటంలో సందేహం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు విధిగా ప్రతి నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్న కండీషన్ పెట్టారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతి రెండు నెలలకు ఒకసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ మాటతో ప్రజాప్రతినిధులందరికి కొత్త బాధ్యత అప్పజెప్పటమే కాదు.. ప్రతి నెలా ప్రయాణించాలన్న మాట వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుందంటున్నారు. కేసీఆర్ మాటను యథాతధంగా అమలు చేసిన పక్షంలో  ఏదైనా సమస్య వచ్చినంతనే దాని ప్రభావం పడేది మంత్రులకు.. ఎంపీలకు.. ఎమ్మెల్యేలకు.. ఎమ్మెల్సీలకు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమకు కొత్త తిప్పలు తెచ్చిన పెట్టిన సీఎం కేసీఆర్ మాటల్ని ఆయా నేతలు ఎంతలా ఫాలో అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English