మహారాష్ట్రపై తెలుగు నేతల మౌనమెందుకంటే..

మహారాష్ట్రపై తెలుగు నేతల మౌనమెందుకంటే..

మహారాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చాయి.. దేశమంతటి దృష్టినీ ఆకర్షించిన మహారాష్ట్ర రాజకీయాలపై అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు, పార్టీలు తలోరకంగా స్పందించారు కానీ తెలుగు రాష్ట్రాల నాయకులు మాత్రం ఈ విషయంపై ఎక్కడా ఏమీ స్పందించలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి.. ఆ తరువాత బీజేపీ, శివసేన మధ్య సీఎం సీటుకోసం కుమ్ములాటలు మొదలు కావడం.. శివసేన భిన్నధ్రువమైన కాంగ్రెస్‌తో కలవడం.. ఎన్సీపీలో చీలిక, ఫడ్నవీస్ ప్రమాణం, రాజీనామా.. మళ్లీ ఇప్పుడు ఉద్ధవ్ ప్రమాణం వంటి పరిణామాలు ఎన్నో జరిగినా కూడా తెలుగు రాష్ట్రాల నాయకుల్లో ఒక్కరు కూడా దీనిపై మాట్లాడిన సందర్భాలు లేవు.

ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ఇన్వాల్వ్ అయిన ఈ వ్యవహారంలో ఏమీ మాట్లాడకుండా ఉండడమే నయమన్న భావన నాయకుల్లో కనిపించింది. బీజేపీతో స్నేహపూర్వక సంబంధాలను నెరపడానికి ప్రాధాన్యం ఇస్తోన్న వైఎస్ఆర్సీపీ 'మహా' రాజకీయాలపై స్పందించలేదు. ఏపీ బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా.. జగన్ వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. కేంద్రంతో సత్సంబంధాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తుండడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగినా ఏమీ స్పందించొద్దని.. ఎవరూ దానిపై మాట్లాడొద్దని జగన్ మొదట్లోనే ఆదేశించారని చెబుతున్నారు. అందుకే.. దానిపై ఎవరూ నోరు చేసుకోలేదని సమాచారం.

మరోవైపు ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉండి.. ఎన్నికల ముందు దూరమైన టీడీపీ కూడా 'మహా' పవర్ గేమ్ గురించి స్పందించలేదు. గత ఏడాది కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుకకు చంద్రబాబు అతిథిగా వెళ్లారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమే లక్ష్యంగా బాబు పని చేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఆయన, టీడీపీ.. మహారాష్ట్ర రాజకీయాల పట్ల స్పందించలేదు.

జనసేన పార్టీ కూడా మహారాష్ట్ర రాజకీయాల విషయమై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లొచ్చారు. కానీ జాతీయ రాజకీయాలపై ఆయన ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదు. బీజేపీకి జనసేన దగ్గరవుతోందని ప్రచారం జరుగుతున్న వేళ.. పవన్ మహారాష్ట్ర రాజకీయాలపై నోరు మెదపకపోవడం గమనార్హం.

గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేసి.. అలాగే మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలని తమపై అక్కడి తెలుగు వారి నుంచి ఒత్తిడి వస్తోందంటూ హడావుడి చేసిన టీఆరెస్ పార్టీ నేతలూ సైలెంటుగానే ఉన్నారు. పైగా ఆర్టీసీ సమస్యలో ఉన్న ఆయన బీజేపీని గిల్లి సమస్యలు తెచ్చుకోవాలనకోలేదు. ఆ కారణంగానే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మిగతా నేతలు కానీ మహా ఎపిసోడ్‌పై నోరు మెదపలేదు.

ఇక మహారాష్ట్రలో రెండు సీట్లు గెలిచిన ఎంఐఎం నేత ఒవైసీ కూడా న్యూస్ చానళ్లు, పేపర్ల వార్తలును పోస్ట్ చేయడం తప్ప తన మాటగా ఏమీ అనలేదు. అయితే.. బీజేపీ భంగపాటుపై మాత్రం వైసీపీ, టీఆరెస్‌, మజ్లిస్ పార్టీలు లోలోన తెగ సంబరాలు చేసుకుంటున్నాయట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English