చంద్రబాబు చాణక్యం ఏమైంది?

చంద్రబాబు చాణక్యం ఏమైంది?

చంద్రబాబు నాయుడు అంటే చాణక్యానికి పెట్టింది పేరు. వైరివర్గాలకు దొరకకుండా వ్యూహాలు పన్నడంలో, పనులు చక్కబెట్టడంలో దిట్ట. అలాంటిది, ఇప్పుడు ఆయన వైఖరి కాస్త చిత్రంగానే వుంది. అందులో దాపరికం కనిపించడం లేదు. తప్పించుకునే వైఖరి అస్సలే కనిపించడం లేదు. తెలంగాణ నేతలతో సమావేశం అయి తెలంగాణ తెచ్చింది టిడిపినే, లేఖ ఇచ్చింది టిడిపినే, మాట ఇచ్చాం, సాధించాం, ఇక తెలంగాణలో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నాం అన్నది ఆయన మాట.. అదే చంద్రబాబు నాయుడు బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందకుండా  ఉండేందుకు చివరిదాకా ప్రయత్నించి, అడ్డుకుంటాను అంటూ బహింరంగ ప్రకటనలు చేసిన వైనాన్ని జనం మరిచిపోలేదు. చందబాబు తెలంగాణ నేతలతో సమావేశమై చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, తెలంగాణ కోసం శ్రమించిది చంద్రబాబే అని సభ్యులతో చెప్పించుకున్నారు. తెలంగాణను అభివృద్ది చేసింది చంద్రబాబే, చేయాల్సింది చంద్రబాబే అంటూ భజన గీతాలు పాడించారు. సరే ఇదంతా నిజమే అనుకుందాం, కాని అందరికి తెలిసేలా ఆయన సీమాంధ్ర కోసం చేసిన ప్రయత్నాల మాటేమిటి అన్నది ఒక ప్రశ్న అయితే, అసలు విభజన అనంతరం బాబు ఈ తరహా వైఖరి అందుకోవడం సీమాంద్రలో ఎటువంటి ఫలితాలు ఇస్తుందన్నది మరో ప్రశ్న.

తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్, దానికి మద్దతిచ్చింది బిజేపి కాని ఈ బిల్లుకు సీమాంధ్ర టిడిపి ఎంపీలు మద్దతివ్వలేదు సరికదా, టిడిపి ఎంపిలు సుజనాచౌదరి,  సిఎం రమేష్ తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యసభలో ఏ మేరకు పోరాడారో దేశం యావత్తు చూసింది. ఇంత జరిగాక అది మరిచిపోకముందే ఇలా జై తెలంగాణ అంటే అక్కడి జనాలు నమ్మేస్తారా? సరే తెలంగాణ వారికి వారి రాష్ట్రం వచ్చేసింది కాబట్టి ఇదంతా పట్టించుకోరు అనుకుందాం,  తెలంగాణ మేమే తెచ్చాం అని ఇప్పుడంటున్న మాటలకు సీమాంద్రలో జనాలు రివర్స్ అయితే ఎలా.. రెండువైపుల జనం ఆమోదం పోందేలా చంద్రబాబు ఎందుకు తన చాణక్యం ప్రదర్శించలేకపోతున్నారు?

సరే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు రెండు ప్రాంతాల్లో ఉనికి కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారు, రాజకీయాలు అన్నాక ఇలాంటి వ్యవహారం తప్పదు. తెలంగాణ ఏర్పాడ్డాక ఇదే చంద్రబాబు ఏమన్నారు, బిజేపి మోసం చేసింది, తెలంగాణకు మద్దతిచ్చింది, సీమాంద్ర ప్రయోజనాలను మంట గలిపింది, దానితో పొత్తు వద్దు అంటూ చంద్రబాబుతో సహా సీమాంద్ర బిజేపి నేతలు బహిరంగంగానే మీడియా ముందు ప్రకటించారు. మళ్లీ అదే భాజపాతో  దోస్తానా చేస్తాం అంటున్నారు. ఇది విన్నాక ఎవరైనా సరే చంద్రబాబు వైఖరిని ఎలా అర్థం చేసుకుంటారు. నిజానికి ఇలాంటి కీలక పరిస్థితిలో చంద్రబాబు తెలంగాణ, సీమాంధ్రలో పర్యటించి, ఇరువర్గాలను సముదాయించి, అభివృద్దికి హామీలు ఇచ్చి, అందరి మనసులు చూరగొనాలి కానీ, ఇలా తడవకో మాట,. మాట్లాడుతూ, ఆఖరికి రెండు వైపుల జనాలకు దూరమయ్యేలా ఎందుకు చేస్తున్నట్లో?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English